- హైకోర్టును కోరిన సిట్
ప్రజాశక్తి-అమరావతి : గాదె సాయికృష్ణ కేసులో ప్రధాన నిందితుడైన సిఐ నాగరాజును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోనే విచారించాలని, విచారణ సమయంలో న్యాయవాది సమక్షం ఉండాలని విజయవాడ రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టులో సిట్ సవాల్ చేసింది. నేరం జరిగిన ప్రాంతం కృష్ణలంక పోలీస్టేషన్ పరిధిలోనే ఉన్నందున, దర్యాప్తు అవసరాల దృష్ట్యా అక్కడే విచారణ జరపడానికి అనుమతినివ్వాలని కోర్టును కోరింది. మెజిస్ట్రేట్ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ శుక్రవారం అత్యవసర లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ కుంచం మహేశ్వరరావు విచారించి, మధ్యంతర ఉత్తర్వులివ్వడానికి నిరాకరిస్తూ తదుపరి విచారణను ఆదివారం ఉదయం 10:30 గంటలకు వాయిదా వేశారు.
సిట్ తన పిటిషన్‌లో దర్యాప్తునకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించింది. సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న తర్వాత చట్ట ప్రకారం మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచకుండా అక్రమంగా కస్టడీలో ఉంచారని, అతడిని గాయాలతో పోలీస్టేషన్‌లో చూసినట్లు కీలక సాక్షులు తెలిపారని పేర్కొంది. సాయికృష్ణ కస్టడీలో ఉన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని, సంబంధిత కాలానికి చెందిన సిసిటివి దృశ్యాలు తొలగించినట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ప్రాథమిక నివేదికలో వెల్లడైందని తెలిపింది. అనుమానాస్పద మరకలున్న చాకూ, ఎముకలు, కాలిన బూడిద, పాక్షికంగా కాలిన స్టీల్ రిస్ట్ చైన్‌తో పాటు ఇతర వస్తువులను ఫోరెన్సిక్ పరీక్షల కోసం స్వాధీనం చేసుకున్నామని, సాయికృష్ణ మృతదేహం ఇంకా లభ్యం కాలేదని, మరణం, మృతదేహం అదృశ్యం చేయడం, ఆధారాల ధ్వంసం వంటి అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని వివరించింది.








కామెంట్‌లు (0)