బుధవారం, 15 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionప్రజాగళం రాయబారం ఉద్రిక్తం

1 గంట క్రితం

1784117668354
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 16, 2026, 12:07 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • పోలీసులు అడ్డుకోవడంపై జాతీయ రహదారిపై బైఠాయించిన పేదలు

  • అధికారులు, నాయకుల హామీతో విరమణ

  • లోకేష్ స్పందించకుంటే ఆగస్టులో మళ్లీ ఆందోళన : సిపిఎం

ప్రజాశక్తి- తాడేపల్లి (గుంటూరు జిల్లా) : సొంత ఇంటి స్థలం, ఇంటి పట్టా కోసం సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం పేదలు చీమలదండులా కదిలారు. మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ సీతానగరంలో వేసిన శిలాఫలకం సాక్షిగా అర్హులైన వారందరికీ ఇంటి స్థలం - ఇంటి పట్టా అందజేయాలని కోరుతూ గత తొమ్మిది నెలలుగా సిపిఎం దశల వారీ పోరాటం నిర్వహించింది. ప్రభుత్వం, అధికారులు స్పందించకపోవడంతో సిపిఎం-ప్రజాగళం పేరుతో లోకేష్ క్యాంపు కార్యాలయ రాయబారానికి పిలుపునిచ్చింది. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున పేదలు అర్జీలతో తరలివచ్చారు.

సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు, గుంటూరు జిల్లా కార్యదర్శి వై.నేతాజీ ఆధ్వర్యంలో ఉండవల్లి సెంటర్ నుండి లోకేష్ క్యాంపు కార్యాలయం వరకు వందలాది మంది పేదలతో ప్రదర్శన ప్రారంభమైంది. స్క్రూ బ్రిడ్జి దాటిన వెంటనే ప్రదర్శనను బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులకు, పోలీసులకు మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది. బారికేడ్లను నెట్టుకుంటూ ముందుకెళ్లడానికి పేదలు ప్రయత్నిం చారు. రోప్ పార్టీ రంగంలోకి దిగి ప్రదర్శనను ముందుకెళ్లనీయకుండా నిలువరించ డంతో ఉద్రిక్తత నెలకొంది. పేదలు, సిపిఎం నాయకులు మంగళగిరి-విజయవాడ పాత జాతీయ రహదారిపై బైఠాయించారు. మంత్రి నారా లోకేష్, టిడిపి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తమకు ఇల్లు, ఇంటి స్థలం కేటాయించాలని, ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలని పేదలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకూ ఆందోళన కొనసాగిస్తామని సిహెచ్.బాబూరావు హెచ్చరించారు. ఎంటిఎంసి కార్యాలయం నుండి అసిస్టెంట్ ప్లానింగ్ కమిషనర్ అజయ్ కుమార్ అక్కడకు చేరుకున్నారు. పేదల దరఖాస్తులను పరిశీలిస్తామని, మూడు నెలల్లోపు సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని, దశల వారీగా ఇళ్ల పట్టాలు ఇస్తామని, ఈ నెలలో కొంతమందికి అందజేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. టిడిపి మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు సత్యనారాయణ, టిడిపి పట్టణ అధ్యక్షులు వి.వెంకట్రావుతో కలిసి ఆందోళనకారుల వద్దకు వచ్చారు. మంత్రి నారా లోకేష్ తో మాట్లాడతామని, లోకేష్ త్వరలో సిపిఎం నాయకులు, పేదలతో మాట్లాడే విధంగా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

అంతకుముందు సిపిఎం తాడేపల్లి పట్టణ కార్యదర్శి బూరుగ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సభలో సిహెచ్.బాబూరావు మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో అన్ని రకాల ప్రభుత్వ పోరంబోకు స్థలాల్లో ఉన్న పేదలందరి స్థలాలకూ ఇంటి పట్టాలు అందజేస్తామని, రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తామని, ఇల్లు లేని పేదలకు పట్టణంలో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని చేసిన వాగ్దానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం రాజధానిలో గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన 55 వేల మందికి సెంటు స్థలం చొప్పున ఇచ్చిన పట్టాలు ఇటీవల ప్రభుత్వం రద్దు చేసిందని, వారికి ప్రత్నామ్మాయ స్థలాలు చూపించాలని, గతంలో అర్జీలు ఇచ్చిన పేదలకు ఎప్పుడు న్యాయం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. 15 రోజుల్లోపు ప్రభుత్వం నిర్దిష్టంగా ముందుకు రానిపక్షంలో ఆగస్టు మొదటి వారంలో మళ్లీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు.​ సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వై నేతాజీ మాట్లాడుతూ ఇళ్ల పట్టాలు, ఇంటి స్థలం కోసం పెద్ద ఎత్తున తరలివచ్చిన పేదలను చూసైనా సమస్య తీవ్రతను గుర్తించి ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు ఎం.రవి, బి.లక్ష్మణరావు, ఈమని అప్పారావు, డి.శ్రీనివాస కుమారి, పల్లె కృష్ణ, దుర్గారావు, జెవి.రాఘవులు, జొన్న శివశంకర్ రావు, వెంకట రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్