బుధవారం, 15 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపట్టిసీమతో కృష్ణా డెల్టా సస్యశ్యామలం

1 గంట క్రితం

పట్టిసీమ ప్రాజెక్టు వల్లే కృష్ణా డెల్టాలో రైతులు సిరులు పండిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 2015 నుంచి ఇప్పటి వరకు పట్టిసీమ ద్వారా
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 16, 2026, 12:08 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • 2015 నుంచి 450 టిఎంసిల గోదావరి జలాల తరలింపు

  • జలహారతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు

ప్రజాశక్తి- ఇబ్రహీంపట్నం : పట్టిసీమ ప్రాజెక్టు వల్లే కృష్ణా డెల్టాలో రైతులు సిరులు పండిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 2015 నుంచి ఇప్పటి వరకు పట్టిసీమ ద్వారా 450 టిఎంసిల గోదావరి వరద జలాలను కృష్ణా నదికి తరలించినట్లు తెలిపారు. ఎన్టిఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద కృష్ణా-గోదావరి నదులకు బుధవారం ఆయన జలహారతి ఇచ్చారు. ప్రముఖ ఇంజనీర్‌ డాక్టర్‌ కెఎల్‌ రావు 124వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రూ.1,300 కోట్లతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు కృష్ణా డెల్టా స్థిరీకరణకు దోహదపడిందని, ఏడాదిలోనే పట్టిసీమను పూర్తి చేసి కృష్ణా డెల్టాను కాపాడిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. 80 టిఎంసిల నీటితో కృష్ణా డెల్టాలోని 13 లక్షల ఎకరాలను స్థిరీకరించామని తెలిపారు. పట్టిసీమ నిర్మాణ సమయంలో పలువురు విమర్శలు చేసినా వాటిని పట్టించుకోకుండా ప్రాజెక్టును పూర్తి చేశామన్నారు. పట్టిసీమకు చేసిన ఖర్చుతో కృష్ణా డెల్టా మొత్తం స్థిరీకరణ జరిగిందని పేర్కొన్నారు. గోదావరి వరద జలాలను వృథాగా సముద్రంలోకి వదిలేయకుండా రైతులకు ఉపయోగపడేలా మళ్లించామన్నారు.

సాగునీటి ప్రాజెక్టుల పట్ల గత పాలకుల నిర్లక్ష్యం

సాగునీటి ప్రాజెక్టుల పట్ల గత పాలకుల నిర్లక్ష్యం రాష్ట్రానికి నష్టం చేసిందని చంద్రబాబు విమర్శించారు. అన్నమయ్య డ్యామ్‌ కొట్టుకుపోయినా, గుండ్లకమ్మ, పులిచింతల గేట్లు దెబ్బతిన్నా పట్టించుకోలేదని, ప్రాజెక్టుల నిర్వహ ణకు కనీసం గ్రీజు కూడా పెట్టలేదని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు పనులను 2014-19 మధ్య 72 శాతం పూర్తి చేశామని, 2024 తర్వాత 89 శాతం వరకు తీసుకొచ్చామన్నారు. 2019-24 మధ్య కనీసం రెండు శాతం పనులు కూడా జరగలేదని విమర్శించారు. రాష్ట్రంలో వంశధార నుంచి పెన్నా వరకు నదుల అనుసంధానం జరగాలన్నదే తన లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. గోల్డెన్‌ క్వాడ్రిలేటరల్‌ తరహాలో నదుల అనుసంధానం జరిగితే దేశానికి తిరుగు ఉండదన్నారు. సముద్రంలో కలిసే నీటిని సాగు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తే పెద్ద ఎత్తున సంపద సృష్టి జరుగుతుందని తెలిపారు. రాబోయే మూడేళ్లలో ప్రాధాన్యతా క్రమంలో 36 సాగునీటి ప్రాజెక్టులను రూ.35 వేల కోట్లతో పూర్తి చేస్తామని ప్రకటించారు.

కెఎల్‌ రావు సేవలు చిరస్మరణీయం

సాగునీటి రంగ అభివృద్ధిలో కెఎల్‌ రావు సేవలు ఎనలేనివని చంద్రబాబు కొనియాడారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌, హీరాకుడ్‌, కోసి వంటి ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. విజయవాడలో జన్మించిన ఎఎల్‌ రావు ఎంపీగా, కేంద్ర మంత్రిగా దేశానికి సేవలందించారని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకునే లక్ష్యంతో జలధార కార్యక్రమాన్ని చేపట్టామని, రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్‌, సత్యకుమార్‌ యాదవ్‌, స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్