మూడు రోజుల్లో 30 మంది పౌరుల మృతి
మరో 260 మందికి గాయాలు
ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు
ఇంధన ఎగుమతులను నిలిపివేస్తామన్న ఐఆర్‌జిసి
వాషింగ్టన్, టెహ్రాన్ : అమెరికా యుద్ధోన్మాద రక్కసి కోరలు చాచింది. అణ్వాయుధాల నియంత్రణ సాకుతో ఇజ్రాయిల్‌తో కలిసి ఇరాన్‌పై దాడులకు తెరలేపిన వాషింగ్టన్ క్రమేపి సామాన్య ప్రజలను కూడా బలిగొంటోంది. శాంతిచర్చలకు చరమగీతం పాడి యుద్ధ నీతికి తిలోదకాలు వదిలి యుద్ధ నేరాలకు తెగబడుతోంది. దక్షిణ ఇరాన్‌పై గత మూడు రోజులుగా అమెరికా సాగించిన అమానవీయ దాడుల్లో 30 మంది పైగా పౌరులు చనిపోయారు. మరో 260 మంది పైగా గాయపడ్డారు. ఈ దాడులకు వేలాది మంది వివిధ రూపాల్లో బాధితులయ్యారు. మరోవైపు బుధవారం కూడా ఇరాన్‌లోని అనేక ప్రాంతాలపై అమెరికా-ఇజ్రాయిల్ దాడులు కొనసాగాయి. ఈ దాడుల్లో ఏడుగురు ఇరాన్ సైనికులు చనిపోయారు. ఈ పరిణామాలతో ఇరాన్ కూడా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై ప్రతిఘటనా చర్యలు చేపట్టింది. దీంతో పశ్చిమాసియాలో మళ్ళీ ఉద్రిక్తతలు ఉధృతమయ్యాయి.
విద్యుత్ ప్లాంట్లు, వంతెనలపైనా దాడులు : ట్రంప్
ఇరాన్ తాము నిర్దేశించినట్లు ఒప్పందం కుదర్చుకునేందుకు ముందుకు రాకపోతే వచ్చే వారం ఇరాన్‌లోని విద్యుత్ ప్లాంట్లపైనా, వంతెనలపైనా దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ బెదిరించారు. మంగళవారం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్ జలసంధి గుండా వెళ్ళే నౌకలపై భారీగా సుంకాలు విధిస్తామని అంతకుముందు చేసిన హెచ్చరికల నుండి ట్రంప్ వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. అమెరికా బలగాలు ఇరాన్ వ్యాప్తంగా దాడులు చేస్తూ, ఆ దేశ ఓడరేవులపై మళ్ళీ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు వెలువడ్డాయి.
పట్టపగలే భీకర దాడులు...
బుధవారం పట్టపగలే ఇరాన్‌పై భీకరంగా వైమానిక దాడులు మొదలయ్యాయి. దాడులు ఉధృతి పెంచాలనే లక్ష్యంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా మిలటరీ ప్రకటించింది. ఇటీవలి దాడుల్లో కేవలం రాత్రి వేళల్లోనే ఇరాన్‌పై దాడులు చేస్తూ వచ్చిన అమెరికా ఇప్పడు వ్యూహాన్ని మార్చి పట్టపగలే తన ఆపరేషన్ మొదలు పెట్టింది. అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్‌పై ఆధిపత్యం, నియంత్రణ ఎవరిదనే అంశంపై వివాదం ఉధృతమవుతున్న నేపథ్యంలో జూన్ 17న ఇరు పక్షాల మధ్య కుదిరిన అత్యంత బలహీనమైన కాల్పుల విరమణ ఒప్పందం పూర్తి స్థాయిలో కుప్పకూలింది. ఈ పరిస్థితుల్లో అమెరికా దాడులు ఎంతకాలం కొనసాగుతాయని ప్రశ్నించగా, ‘ఇక చాలు అని నేను చెప్పేవరకు’ అని ట్రంప్ సమాధానమిచ్చారు. హర్మూజ్‌లో పయనించే వాణిజ్య నౌకలపై దాడులు జరిపేందుకు ఇరాన్‌కు గల శక్తి సామర్ధ్యాలను పూర్తిగా క్షీణింపచేయాలన్నదే తమ లక్ష్యమని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఈ లక్ష్యంతోనే గత నాలుగు రోజులుగా ఇరాన్‌పై దాడులు కొనసాగుతున్నాయని పేర్కొంది.
ఏడుగురు మిలటరీ సిబ్బంది మృతి
తాజా దాడుల్లో ఏడుగురు ఇరాన్ మిలటరీ సిబ్బంది మరణించినట్లు ఆ దేశ ఆర్మీ బుధవారం ప్రకటించింది. ఇరాన్‌కు సుదూర ఆగ్నేయాన ఇరాన్‌షార్ నగరానికి సమీపంలో గల బారక్స్‌పై క్షిపణి దాడులు జరిగాయి. ఆ దాడుల్లో ఏడుగురు మృతి చెందారని ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. గెస్ట్ హౌస్, గార్డు పోస్ట్, ఇతర వసతి సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని 13 క్షిపణులను ప్రయోగించారని, సాధ్యమైనంత ఎక్కువగా నష్టం కలిగించాలన్నది వారి లక్ష్యంగా వుందని ఆర్మీ పేర్కొంది. ఈ దాడులకు నిర్ణయాత్మకంగా ప్రతిస్పందిస్తామని ఆర్మీ ప్రకటించింది. గత మూడు రోజుల దాడుల్లో ఇరాన్‌లో 30మందికి పైగా పౌరులు మరణించారని ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి బుధవారం తెలిపారు. గత రాత్రంతా సాగిన దాడుల్లో 260మందికి పైగా గాయపడ్డారని ఆరోగ్య శాఖ ప్రతినిధి తెలిపారు. కాగా బుధవారం తెల్లవారు జామున బహ్రెయిన్, కువైట్‌లపై దాడులు జరిగాయి. అమెరికా దాడులకు, ఓడరేవులపై ఆంక్షలకు ప్రతిగా ఇరాన్ ప్రతి దాడులు చేసింది. పశ్చిమాసియా వ్యాప్తంగా ఇంధన ఎగుమతులు నిలిపివేస్తామని హెచ్చరించింది. తొలుత ఏప్రిల్ మధ్యలో ఓడరేవులపై ఆంక్షలు విధించిన అమెరికా తర్వాత జూన్ మధ్యలో ఎత్తివేసింది. మళ్ళీ ఇప్పడు ఆ ఆంక్షలను పునరుద్ధరించింది.
గల్లంతైన భారత నావికుని మృతదేహం లభ్యం
ఒమన్ తీర ప్రాంతంలో ప్రయాణిస్తున్న జిఎఫ్‌ఎస్ గెలాక్సీ నౌకపై జరిగిన దాడిలో మరణించిన భారత నావికుడి మృతదేహం లభ్యమైందని నావికుల యూనియన్ అధికారి మనోజ్ యాదవ్ బుధవారం వెల్లడించారు. పూనే నగరానికి చెందిన మెరైన్ ఇంజనీర్ హేరంబ్ కర్మాకర్ (30) ఆదివారం దాడి జరిగిన తర్వాతనుండి కనిపించకుండా పోయారు. ఆయన మృత దేహాన్ని ఒమన్ తీర ప్రాంత రక్షణ దళం కనుగొంది.






కామెంట్‌లు (0)