నేడు ఇంగ్లండ్‌తో రెండో వన్డే
గిల్ ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ
సాయంత్రం 5.30గం.ల నుంచి
కర్డీఫ్: తొలి వన్డేలో ఘన విజయం సాధించిన టీమిండియా.. ఇక సిరీస్‌పై కన్నేసింది. సోఫ్లా గార్డెన్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగే రెండో వన్డేలో టీమిండియా గెలిస్తే.. మరో వన్డే మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోనుంది. తొలి వన్డేలో గెలిచిన టీమిండియా.. మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. మరోవైపు ఇంగ్లండ్ ఈ వన్డే గెలిచి సిరీస్ సమం చేయాలని చూస్తోంది. అయితే రెండో వన్డేకు ముందు భారత జట్టును రెండు కీలక అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫిట్‌నెస్, సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ, కోహ్లి ఫామ్ మేనేజ్‌మెంట్‌కు ప్రధాన సమస్యగా మారింది. తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ 80 పరుగులు చేసి కండరాల నొప్పితో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. దీంతో గిల్ ఫిట్‌నెస్‌పై బిసిసిఐ ప్రత్యేక దృష్టి సారించింది.
సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ గత ఏడాది అక్టోబర్ నుంచి 13 వన్డేల్లో 563 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు అర్ధసెంచరీలు ఉన్నాయి. వన్డే ప్రపంచ కప్ 2027 సమీపిస్తున్న నేపథ్యంలో ఇకపై ప్రతి మ్యాచ్‌లోనూ ప్రభావం చూపాల్సిన అవసరం ఉంది. మరోవైపు విరాట్ కోహ్లీ మాత్రం అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. గత 10 వన్డేల్లో 621 పరుగులు చేయగా.. మూడు సెంచరీలు, మూడు అర్ధసెంచరీలు చేశాడు. మొదటి మ్యాచులో విఫలమైనా.. కోహ్లీపై నమ్మకం ఉంది. ఇక బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా.. తొలి మ్యాచ్‌లోనే ఫామ్‌లోకి వచ్చాడు. ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ అద్భుత ప్రదర్శనతో జట్టును ఆదుకున్నారు. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇద్దరూ కీలక భాగస్వామ్యంతో భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. అక్షర్ బంతితోనూ నాలుగు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
రెండో వన్డే కోసం భారత జట్టులో ఒక మార్పు జరిగే అవకాశం కనిపిస్తోంది. సోఫియా గార్డెన్స్ పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉండటంతో యువ పేసర్ గుర్నూర్ బ్రార్ స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో బ్రార్ రెండు వికెట్లు తీసినప్పటికీ.. 9 ఓవర్లలో 61 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో కీలక మ్యాచ్ కాబట్టి అర్ష్‌దీప్ వైపు జట్టు యాజమాన్యం మొగ్గు చూపే అవకాశం ఉంది. అదే జరిగితే స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మరోసారి బెంచ్‌కే పరిమితం కావచ్చు.
జట్లు(అంచనా)...
టీమిండియా: శుబ్‌మన్(కెప్టెన్), రోహిత్, కోహ్లి, శ్రేయస్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), దూబే, అక్షర్, బుమ్రా, అర్ష్‌దీప్, కుల్దీప్, ప్రసిధ్ కృష్ణ/ గుర్నూర్ బ్రార్.
ఇంగ్లండ్: బ్రూక్(కెప్టెన్), డకెట్, బేథెల్, రూట్, బట్లర్(వికెట్ కీపర్), సామ్ కర్రన్, విల్ జాక్స్, డాసన్, ఆర్చర్, రషీద్, టంగ్.






కామెంట్‌లు (0)