సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రైవేటుపరం చేయాలనే ప్రభుత్వ యోచన సరైందికాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య పేర్కొన్నారు. తక్షణమే జిఓ నెంబరు 396ను ఉపసంహరించుకోtవాలని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దస్తావేజు లేఖర్లు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టారని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రభుత్వ విభాగాలను ప్రైవేటుకు అప్పగించే పావులు కదిపిన కూటమి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ఆధునీకరణ, పిపిపి పేరుతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను సైతం ప్రైవేటీకరించడం తగదన్నారు. దీనిపై ముఖ్యమంత్రి వివరణ అసంతృప్తిగా ఉందని, ఆస్తుల విలువ పెరిగిన దృష్ట్యా పలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలు వెలుగుచూస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆధీనంలోనే పలు లోపాలు వెలుగుచూసినప్పుడు ప్రైవేటుకు అప్పగిస్తే అవినీతి, అక్రమాలు మరింత పెరిగి, పరిస్థితి దయనీయంగా ఉంటుందనడంలో సందేహం లేదన్నారు.







కామెంట్‌లు (0)