రాజీనామా తరువాతే చర్చ
ఉభయ సభల్లో ప్రతిపక్షాల పట్టు
ప్రధాని సభలో ఎందుకు ప్రకటనలు చేయరని నిలదీత
ఆందోళనలతో వాయిదాల పర్వం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముందుగా రాజీనామా చేయాలని, ఆయన రాజీనామా చేసిన తరువాతే ‘నీట్ ’ వ్యవహారంపై చర్చ జరపాలని పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ‘చర్చకు ముందు మంత్రి తప్పుకోవాలి’ అన్న నినాదాలు ఉభయ సభల్లోనూ మారుమ్రోగాయి. అయితే, దీనికి కేంద్ర ప్రభుత్వం నుండి సానుకూల స్పందన లేకపోవడంతో బుధవారం నాడు కూడా పార్లముంటు వాయిదాల బాట పట్టింది. చర్చకు సిద్ధమని ఒకవైపు చెబుతూనే కీలకమైన మంత్రి రాజీనామా విషయమై కేంద్ర ప్రభుత్వం మౌనం పాటించడంతో ఈ పరిస్థితి అనివార్యంగా మారింది. దీంతో్ ప్రతిపక్షాలు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశాయి. ‘నిష్పక్షపాతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అది జరగాలంటే కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఆయన రాజీనామా చేసే వరకు చర్చకు ఆస్కారం లేదు’అని ప్రతిపక్ష నేతలు ఉభయ సభల్లోనూ పదేపదే చెప్పారు. అయినా, కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోవడంలో లోక్‌సభ, రాజ్యసభలో గందరగోళం నెలకొంది. రెండు సభల్లోనూ వాయిదాల పర్వం కొనసాగింది. లోక్‌సభను స్పీకర్ ఓం బిర్లా ప్రారంభిస్తూ ప్రశ్నోత్తరాలు నిర్వహించేందుకు సిద్ధపడ్డారు. అయితే ప్రతిపక్ష ఎంపిలు తాము ఇచ్చిన వాయిదా తీర్మానా లపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాల హోరెత్తించారు. దీంతో సభను మధ్యాహ్నం 12 వరకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్షాలు ఆందోళనను కొనసాగించాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నీట్ పేపర్ లీక్‌పై చర్చించాలని ప్రతిపక్ష ఎంపిలు డిమాండ్ చేశారు.
నల్ల దుస్తులతో ప్రతిపక్షాలు ఆందోళన
కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నల్లదుస్తులతో ప్రతిపక్ష సభ్యులు బుధవారం ఉభయ సభలకు హాజరయ్యారు. పార్లమెంట్ ఆవరణలో నల్లదుస్తులతో ఆందోళన చేపట్టారు. పార్లమెంట్‌లోని మకర ద్వారం ఎదురుగా జరిగిన ఈ నిరసనలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్, కాంగ్రెస్ ఎంపిలు ప్రియాంక వాద్రా, కెసి వేణుగోపాల్, సమాజ్ పార్టీ నేత అభిలేష్ యాదవ్, ఎంపిలు ధర్మేంద్ర యాదవ్, అవధేష్ ప్రసాద్, సిపిఎం ఎంపిలు జాన్ బ్రిట్టాస్, ఎస్.వెంకటే షన్, ఎఎ రహీం, సిపిఐ ఎంపి సంతోష్ కుమార్, జెఎంఎం ఎంపి మహువా మాంఝీ, టిఎంసి ఎంపిలు మహువా మొయిత్రా, సౌగత్ రాయ్, ఆర్‌జెడి ఎంపి మనోజ్ కుమార్ ఝా తదితర లు పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలు నల్ల దుస్తులు ధరించగా.. ఎస్‌పి ఎంపిలు నల్ల కండువాలు వేసుకున్నారు. విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు హోరెత్తించారు. ‘పేపర్ లీక్’, సేవ్ లైవ్స్-స్టాప్ నీట్’ అనే ప్లక్లార్డులు పట్టుకొని ఆందోళన చేపట్టారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిన తర్వాతే ఎలాంటి చర్చ అయినా ఉభయ సభల్లో జరిపేందుకు సిద్ధమని నేతలు తెలిపారు. ‘ముందుగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఆ తర్వాతే చర్చ జరుగుతుంది. ఇంతమంది విద్యార్థులపై లాఠీచార్జ్ చేసిన తరువాత ఇప్పుడు మాట్లాడేదేముం ది’ అని వారు అన్నారు ‘మంత్రిని తొలగించ లేనంతగా ప్రభుత్వంపై ఏం ఒత్తిడి ఉంది. మేము నల్ల దుస్తులు ధరించి వచ్చాము. నలుపు నిరసనకు చిహ్నం; అది దుఃఖానికి కూడా చిహ్నం’ అని ప్రతిపక్ష నేతలు అన్నారు.
పోలీసులు పెల్లెట్ గన్స్ ప్రయోగం దుర్మార్గం : సిపిఎం
విద్యా వ్యవస్థ పూర్తిగా విఫలమైనందుకు జవాబుదారీతనం కోరుతున్న విద్యార్థులు, యువతపై బిజెపి ప్రభుత్వం క్రూరంగా బలప్రయోగం చేసిందని సిపిఎం విమర్శించింది. ఈ మేరకు బుధవారం సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఢిల్లీ పోలీసులు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు జూలై 20న జరిపిన అణచివేతలో విద్యార్థులకు తీవ్రగాయాలైన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనలో పెల్లెట్ గన్స్ పోలీసులు ఉపయోగిచడం షాక్ గురిచేసిదని, తీవ్ర గాయాలైన యువకుడికి శస్ర్తచికిత్స జరుగుతుందని సిపిఎం తెలిపింది. పోలీసుల తీరుపై విస్మయం వ్యక్తం చేసింది. అధికారం మాటున సత్యాన్ని కప్పిపుచ్చలేరని, హోం మంత్రి దీనికి సమాధానం చెప్పాలని సిపిఎం డిమాండ్ చేసింది.







కామెంట్‌లు (0)