ఆదివారం, 23 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవెలిగొండ నిర్వాసితులను ఆదుకోకుండా ప్రాజెక్టు ప్రారంభమా?

1 గంట క్రితం

WhatsApp Image 2026-08-22 at 19.38.13.j
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 23, 2026, 09:39 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • బలవంతంగా ఖాళీ చేయిస్తే ఈ ప్రభుత్వానికి మరణ శాసనమే!

  • రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి

ప్రజాశక్తి-మార్కాపురం : వెలిగొండ ప్రాజెక్ట్ కోసం త్యాగం చేసి సర్వం కోల్పోయిన నిర్వాసితులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారిని భయాందోళనకు గురిచేస్తోందని ఎపి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం తమ గొప్ప కోసం హడావిడిగా వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించేందుకు పూనుకుందని... నిర్వాసితుల సమస్యలను కూడా అదే వేగంతో పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు. ప్రభాకర్ రెడ్డి, ఎపి రైతు సంఘం జిల్లా సీనియర్ నాయకులు గాలి వెంకట్రామిరెడ్డి, ఊసా వెంకటేశ్వర్లు, టి.ఆవులయ్య, వందన కుమార్ తో కూడిన ప్రతినిధి బృందం... వెలిగొండ ముంపు గ్రామమైన పెద్దారవీడు మండలంలోని కలనూతలలో శనివారం పర్యటించింది. నిర్వాసితుల సమస్యలు, బాధలు తెలుసుకుంది. ఈ సందర్భంగా మార్కాపురం పట్టణంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కె.ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. నిర్వాసితులను బలవంతంగా ఖాళీ చేయిస్తే ఈ ప్రభుత్వానికి మరణ శాసనమేనని హెచ్చరించారు. ప్రభుత్వమే తప్పులతడకగా నిర్వాసితుల జాబితా తయారు చేసిందని విమర్శించారు. 2019 నాటికి అర్హులైన 300 మంది యువకుల పేర్లు జాబితాలో లేవని, వారందరికీ పరిహారం మాట ఏమిటని ప్రశ్నించారు. కలనూతల గ్రామానికి చెందిన పాలెం పిచ్చయ్య వయసు 43 సంవత్సరాలుగా ఉందని, ఆయన ఇంటికి నేటికీ పరిహారం ఇవ్వలేదని, అలాంటివారు 22 మంది ఉన్నారని, ఈ తప్పిదం రెవెన్యూ అధికారులే చేశారని వివరించారు. సుగాలి తండా కు చెందిన పుల్లా నాయక్ అనే వ్యక్తికి ఏడుగురు సంతానమని, అందులో ఒకరు చనిపోగా ఆరుగురు కుమారులు ఉన్నారని, వారందరూ పెద్దవారేనని, ప్యాకేజీకి అర్హులేనని, ఆ కుటుంబంలో ఇద్దరు మనవళ్లు కూడా ప్యాకేజీకి అర్హత సాధించారని, ఆ కుటుంబ యజమానికి ఒక్కరికి మినహా మిగిలిన ఏ ఒక్కరికీ ప్యాకేజీ రాలేదని తెలిపారు. అలాంటి కుటుంబం ప్యాకేజీ తీసుకోకుండా గ్రామం ఖాళీ చేసి ఎలా బతకాలని ప్రశ్నించారు. ఇలాంటి కేసులు కోకొల్లలుగా ముంపు గ్రామాలలో ఉన్నాయన్నారు. నేటికీ ప్యాకేజీ అందని వారు ఎందరో ఉండగా, ఈ నెల 27న ట్రయల్ రన్, 31న వెలిగొండ ప్రారంభించేలా సన్నాహాలు చేయడం జరుగుతోందన్నారు. 2013 భూ సేకరణ చట్టంలో నిర్వాసితుల కోసం ఎన్నో అంశాలు ఉన్నాయని, గ్రామం ఖాళీ చేయాలంటే ఆరు నెలల సమయం ఇవ్వాలనేది చట్టంలో ఉందని, ప్రభుత్వానికి సైతం చట్టాన్ని వివరించడంలో ఇక్కడ అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. నిర్వాసితుల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల అసంతృప్తి పెరుగుతోందన్నారు. ఇప్పటికిప్పుడు గ్రామాలు ఖాళీ చేయాలని నిర్వాసితుల మెడపై కత్తి పెట్టడం ఏ మాత్రం సబబు కాదన్నారు. శ్రీశైలం డ్యాం లోనూ పొంగిపొర్లేంత నీరు లేదని, కేవలం ప్రభుత్వ గొప్ప కోసమే ఈ హడావుడి చేస్తోందని విమర్శించారు. విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి దగ్గుపాటి సోమయ్య, రైతు సంఘం నాయకులు ఊస వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్