భారతదేశంలో కార్మికులు వారు చేసే పనిని, వారే వీడియో తీసేలా చేయిస్తున్నారు. వారి స్థానంలో రోబోలు వస్తే వారికెవరు జీతం ఇస్తారు. మొదట వీడియో పరికరాన్ని వారికే అమర్చినపుడు ఏదో తమాషా గా అనిపించినా తరువాత ఈ కొత్తదనమే విచారించాల్సిన విషయమైంది. వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న 32 ఏళ్ల లలితకు సూపరువైజరు తన తలకు పెట్టుకోమని ఇచ్చిన కెమెరాను చూసి చాలా నవ్వొచ్చింది. లలిత అక్కడ ఏడాది నుంచి పనిచేస్తోంది. వాళ్ల షిఫ్ట్ మొదలుపెట్టే ముందు పనివాళ్ళందరినీ కెమెరాలను వాళ్ళ తలలకు కట్టుకోమని చెప్పారు. కానీ ఎందుకు ? ఏమిటి ? అని వాళ్ళకెవరూ చెప్పలేదు.
ఆ తల మీది కెమెరా, వారు చేసే కుట్టు పనినంతా రికార్డు చేస్తుంది. వారు కుట్టు మిషన్ మీద బట్టను ఎలా అలవోకగా వేళ్ళ సందుల నుండి జార్చుతారో.. వాటికి కాలర్లు అంచులు ఎంత కరెక్ట్ గా కుట్టగలరో.. ఎంత వేగంగా బట్టను కుచ్చులుగా పెడుతూ కుట్టగలరో.. ఇదంతా కాకుండా వారు తోటివాళ్ళతో మాట్లాడే విషయాలతో సహా అది రికార్డు చేస్తోంది. ఎదుటివారు తమ తలకు పెట్టుకున్న రికార్డు వింతగా కనిపిస్తూ ఉంటే మొదట తమాషాగా అనిపించేది. కానీ ఫాక్టరీలో వాతావరణం క్రమంగా మారిపోసాగింది. వారి ఉత్పాదకతను పరిశీలిస్తున్నారని మరింత స్పృహతో ఉండాల్సిన అవసరం అనిపించింది. కుట్టుమిషన్ చప్పుడు మధ్యలో వినిపించే సంభాషణలు తగ్గిపోసాగాయి. వారి వలన జరిగే పొరపాట్లు, కునికిపాట్లు రికార్డు అవుతాయేమోనని మరింత శ్రద్ధగా పనిచేసేవారు. ఆ ఫాక్టరీలోని లలితకు, ఇతరులకు తెలియని విషయమేమంటే కార్మిక పనులను ఆటోమేట్ చేసే విషయంలో అత్యంత విలువైన సమాచార సేకరణ కోసం భారతదేశంలోని పలు సంస్థలలో తమ కార్మికుల చేత డేటా రికార్డు చేయిస్తున్నారని.
రోబోలను ఉపయోగించేందుకే!
ఉత్పత్తి రంగంలో రోబోలను ఉపయోగించేందుకు వీలుగా వాటికి తగిన తర్ఫీదు ఇవ్వటానికి అవసరమైన ముఖ్యమైన వనరు ఇగోసెంట్రిక్ డేటా. మనం ఏదైనా పని చేసే సమయంలో మన కంటికి కనిపించే కోణం నుంచి రికార్డు చేయటమే ఇగోసెంట్రిక్ డేటా కలెక్షన్. కృత్రిమ మేధ పురోగతిలో ‘హ్యూమనాయ్ డ్ రోబోలు’ ప్రస్తుతం ముందువరుసలో ఉన్నాయి. రోబోటిక్స్, స్వయంచాలకంగా పనులు చేయించే ప్రక్రియకు ప్రధాన అవరోధం డేటాగా పరిగణింపబడుతోంది. ఛాట్ జిపిటి, జెమిని వంటి భాషా ప్రధాన మోడల్స్ సమర్థవంతంగా తయారుచేయటానికి ఆన్ లైన్ లో లభించే సాహిత్యం, టెక్స్ట్ సరిపోతుంది. కానీ రోబోలకు పని నేర్పాలంటే వాటికి, తమ పనిని స్వయంగా తామే రికార్డు చేస్తేనే ఆ ఫుటేజ్ మాత్రమే ఉపయోగపడుతుంది. ఇగోసెంట్రిక్ ఫుటేజ్ కలెక్టు చేసే కంపెనీలు చెప్పిన దానిననుసరించి చాలా ఫాక్టరీలలో, షాపులలో, వేర్ హౌస్ లలో రికార్డు చేసిన కొన్ని లక్షల బిలియన్ల ఫుటేజ్ వలన మాత్రమే భవిష్యత్తులో రోబోలతో పని చేయించగలము.
ఇగోసెంట్రిక్ డేటా కలెక్షన్
లలిత పనిచేస్తున్న హర్యానాలోని గురుగ్రామ్‌లో ఒక ఫ్యాక్టరీ నుంచి డేటాను సేకరిస్తున్న భారత కంపెనీ, తమ కస్టమర్ లలో టెస్లా పెద్ద కస్టమర్ అని చెప్పింది. టెస్లా కంపెనీ CEO ఇలాన్ మస్క్ అంచనా ఏంటంటే కంపెనీ విలువ భవిష్యత్తులో 89 శాతం వరకు హ్యుమనాయ్ డ్ రోబోల వలన వస్తుంది. కానీ ఎలక్ట్రిక్ వాహనాల వలన కాదు. ఇగోసెంట్రిక్ డేటా కలెక్షన్ గ్లోబల్ రేసులో ఇండియా ఒక కీలకమైన హబ్ గా మారుతోంది. ఈ అవకాశం అదునుగా రోబోటిక్స్ కంపెనీలకు డేటా అందించేందుకు తగిన వ్యవస్థ తయారవుతోంది. హ్యుమన్ ఎఐ, ఎఫ్ పి వి ల్యాబ్స్, మైక్రో 1, ఇగోడేటా, నియో కేంబ్రిన్ ఇలాంటి పలు కంపెనీలు రంగంలోకి వచ్చాయి.
ఇగోసెంట్రిక్ డేటా కలెక్టు చేసే లేబుల్లర్ ఎఐ కంపెనీ, వ్యవస్థాపకుడు పునీత్ జిందాల్ మాట్లాడుతూ ప్రపంచంలోకెల్లా దక్షిణ ఆసియాలోనే పలు కార్మిక ఆధారిత వ్యవస్థలు ఉన్నాయన్నారు. ఒకేచోట పది లక్షల మంది పనివాళ్ళు బట్టలు కుట్టడం, విడిభాగాలను ఎసెంబుల్ చేయడం, వస్తువులను క్రమబద్ధీకరించటం వంటి పనులు చేసే కంపెనీలు ఇక్కడ వున్నాయి. ఇంతటి వైవిధ్యవంతమైన, సాంద్రత కలిగిన శ్రామికశక్తి ఇండియాలో తప్ప ఎక్కడా దొరకదు అన్నారు. రోబోటిక్స్ కంపెనీలు తమ మెషిన్లకు ఇలాంటి పనులు నేర్పాలనుకుంటాయి.

అనోటేషన్ వ్యాపారం..
కెమెరాతో ఫుటేజ్ కాప్చర్ చేయటం మొదటి అడుగు మాత్రమే. తరువాత దాన్ని అనోట్ (ఉల్లేఖించి) చేసి క్లైంట్సుకి పంపుతారు. వీడియోలో చేతులు మాత్రమే కనబడేట్లుగా, వాటి కదలికలు ఖచ్చితంగా అనుకరించేలా వుండేలా, బ్యాక్ గ్రౌండ్ లో అనవసర విషయాలేవీ లేకుండా, అనోట్ చేసి కంపెనీలకు పంపుతారు. ఈ అనోటేషన్ వ్యాపారంలో భారతదేశానిది సింహభాగమే. పరిశ్రమ వర్గాలు చెప్పిన ప్రకారం ప్రపంచ డేటా అనోటేషన్ వ్యాపారంలో 35 శాతం ఇండియాదే. దీంట్లో 60 శాతం రెవెన్యూ అమెరికా కంపెనీల నుంచి వస్తుంది.
ఫ్యాక్టరీలు దాటి డేటా కలక్షన్!
ఇగోసెంట్రిక్ డేటా కలెక్షన్ ఇప్పుడు ఫ్యాక్టరీలు దాటి పెరిగిపోతోంది. భవన నిర్మాణ కూలీలు, డెలివరీ ఏజెంట్లు, వీధి వ్యాపారులు మొదలైన వారితో వారి రోజువారీ పనులు రికార్డు చేసేందుకు కొన్ని టెక్నికల్ కంపెనీలు వాళ్ళతోనే ఒప్పందం చేసుకుంటున్నాయి. అక్కడి లోకల్ కాంట్రాక్టర్లు ద్వారా వారికి చెల్లింపులు చేస్తున్నాయి.
వారి పనులను డేటాబేస్ లోకి మార్చి, వారు అమ్ముకుంటారని తెలిసినా వారేమీ బేరం చేయలేరు. ఒక బేల్దారీ తనకు గంటకు 3 డాలర్లు చొప్పున వారానికి 30 నుంచి 40 డాలర్లు వరకు సంపాదిస్తున్నాడు. తనకు వచ్చే రోజుకు ఎనిమిది డాలర్లకు ఈ అదనపు ఆదాయం అతనికి ఎంతో అవసరం. కెమెరా కొంచెం బరువుగా వున్నా ఇప్పుడిప్పుడే అలవాటౌతుంది అన్నాడా బేల్దారీ. తనంత తానుగా దీనికి ఒప్పుకున్నా, ఈ డేటా తనకు కొంత ఆదాయం కలిగిస్తుందని తప్పితే దీనితో వారు ఏమి చేస్తారో తనకు తెలియదన్నాడు. టెక్నికల్ కంపెనీ కూడా ఈ విషయాలు వారితో చర్చించలేదన్నారు. ‘ఈ వర్కర్సు తమ పనికి వేతనం అందుకుంటూనే ఈ డిజటల్ ఎసెట్ తయారుచేసినా ఈ ఎసెట్ తో ఏమి చేయగలరనే విషయం వారికి తెలియదు. తెలిసినా దానిపై బేరసారాలు జరిపే అవకాశం కూడా లేదు’ అని రీసర్చ్ స్కాలర్ మధుమిత దత్తా అభిప్రాయం వ్యక్తం చేశారు.
కార్మికులకు చెల్లింపులు లేవు..
ఇగోసెంట్రిక్ డేటాకు డిమాండ్ పెరుగుతోంది. కొత్త కొత్త కంపెనీలు డేటాను మరింత తక్కువ ధరకే అందిస్తామంటున్నాయి. ‘అంతర్జాతీయ వినియోగదారులు ఈ డేటాకు మరింత ఇవ్వటానికి సిద్ధంగా వున్నా కాంపిటీటర్స్ ను తట్టుకునేందుకు ఖర్చు తగ్గించవలసి వస్తుంది. ఇది సప్లై చైనులో వచ్చేసరికి కలెక్షన్ చేసిన వాడికి ఏమీ మిగలటం లేదు. కార్మికులకు చెల్లించటానికి ఫ్యాక్టరీ ఓనర్లు సుముఖత చూపడం లేదు. ఆల్రెడీ లేబర్ ఖర్చు పెరుగుతోంది.. లాభం మార్జిన్ తగ్గుతోంది. ఇంకా ఖర్చు పెరిగితే ఫ్యాక్టరీ మూసివేయడమో, ప్రొడక్షన్ తగ్గించటమో చేయాలి. తద్వారా వర్కర్స్ కు ఉపాధి లేకుండా అవుతుంది’ అని జిందాల్ అన్నారు.
ఎఐ కే కాదు వేరే వాటికోసమూ..
ఈ ఫుటేజ్ తో AI తర్ఫీదు మాత్రమే కాదు ఇంకా వేరే విషయాలకు కూడా దీనిని ఉపయోగిస్తున్నరని తెలుస్తోంది. కొన్ని కంపెనీలలో ప్రొడక్టివ్ రిపోర్ట్స్ తయారు చేయటానికి, వర్కర్స్ ఎంత సమయం ఎంత చురుకుగా పనిచేసారనే ఆధారంగా రాంకింగ్ చేయటానికి, పనిచేయని వర్కర్సు వలన వచ్చే నష్టం లెక్కగట్టడానికి, వాళ్ళు ఎంతసేపు ఎవరెవరితో మాట్లాడారనే విషయాలు ట్రాక్ చేయటానికి వాడుతున్నారు. ఒక్కోసారి వారు ఎవరెవరితో ఎంతెంత సమయం కలుస్తున్నారనే విషయంగా వారిని విడిగా పిలిచి మరీ అడుగుతున్నారు.
భద్రతకు, గోప్యతకు తిలోదకాలు..
బెంగళూరు బేస్డ్ గా నాన్ ప్రాఫిట్ వర్కు ఫెయిర్ అండ్ ఫ్రీ ఫౌండేషన్ సంస్థలో రీసెర్చర్ గీతా తాత్ర అంటారు.. కంపెనీలకు అమ్మేందుకు పనిచేసే చోటున డేటా కలక్షన్ పెరుగుతున్న నేపథ్యంలో, గోప్యతకు సంబంధించి అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. మహిళలు తమ నుదురుకు అమర్చుకున్న కెమెరా విషయం మర్చిపోయి బాత్రూమ్ లకు వెళ్లిన విషయాలు చెప్పారని అన్నారు. వారి భద్రతకు, గోప్యతకు ఏమి జరుగుతుంది, వీటికి సమాధానం లేదన్నారు. ఈ కాంట్రాక్టు ఉద్యోగాలలో వాళ్ళ పరికరాలు తమపై పెట్టుకునేందుకు అనుమతి నిజంగా ఇవ్వకుండా ఉండగలరా? అనుమతి ఇవ్వకపోతే ఉద్యోగ భద్రత వుంటుందా? ఇంటర్వ్యూ చేసిన కంపెనీలలో ఏ ఒక్కటి కార్మికుల నుంచి అనుమతి తీసుకున్నట్టు చెప్పలేదు.

ఇండియాలో చౌకగా..
డేటా కలక్షన్ కు ఖర్చు ఒక ప్రధానాంశం. యుఎస్ లో ఒక గంట డేటా కలెక్షన్ కి 30 డాలర్లు చెల్లించాల్సి వస్తే అదేపనికి ఇండియాలో ఆరో వంతు కన్నా తక్కువే అవుతుంది. డేటా కలెక్షన్ కంపెనీలు ఇక్కడి సంస్థలతో ఒప్పందం చేసుకుంటాయి. కానీ సరాసరి వ్యక్తులకు చెల్లింపులు చేయవు. ఐదు రాష్ట్రాలలోని ఆరు కంపెనీలలో గార్డియన్ చేసిన డేటా కలెక్షన్ పరిశీలిస్తే కంపెనీలకు అమ్మేందుకు స్మార్ట్ గ్లాసెస్ నుంచి నుదురుకు అమర్చుకునే కెమెరాల వరకు వాటిని ధరించి డేటా ఫుటేజ్ కాప్చర్ కు సహకరించిన కార్మికులకు ఎలాంటి చెల్లింపులూ చేయలేదు. ఫాక్టరీలలో అప్పుడప్పుడు కూల్ డ్రింక్ ఇచ్చేవారు, అది కూడా డేటా కలెక్షన్ పనికో లేదా ఢిల్లీ ఎండలకో తనకు తెలీదని లలిత చెప్పారు. వారికి ఎందుకు చెల్లించలేదని కంపెనీలను అడిగినప్పుడు ఫాక్టరీలకు ముందే చెల్లించామని, ఇక విడిగా పనివాళ్ళకు ఏమీ ఇవ్వనవసరం లేదన్నారు. నిజంగా డేటా కాప్చర్ చేసిన వారికి ఇవ్వకపోవటం సరిగా లేదన్నారు విమర్శకులు.
చెల్లింపులకు కొత్త విధానం అవసరం..
ఆప్తి సంస్థ వ్యవస్థాపకుడు సరయు నటరాజన్ మాటల ప్రకారం ఒక పని చేయటం ఒప్పుకోవటం దానికి తగిన చెల్లింపులు చేయటం మించి చర్చించాల్సిన విషయాలు వున్నాయి. వర్కు ప్లేసులోని కన్వెన్షనల్ డేటాకూ ఈ రికార్డులకూ చాలా తేడా వుంది. శ్రామికుడి శరీర కదలికలు, అతని పనితనం, నేర్పరితనం, అనేక సంవత్సరాల నాలెడ్జ్ అన్నీ రికార్డు చేస్తాయి. ఇక అవి గ్లోబల్ AI డేటా బేస్ లో సర్క్యులేట్ అవుతాయి. ఈ డేటాపై యాజమాన్య హక్కులు, వారికి తగిన చెల్లింపులు చేయటంపై ప్రస్తుత కార్మిక చట్టాలు తగినవి కావని ఆమె అభిప్రాయం. కార్మికులు ఈ వారం పనిచేసిన సమయానికి తగ్గ వేతనం పొందుతారు. కానీ వారు కలెక్టు చేసిన డేటా సంపాదించే సుదీర్ఘ ప్రయోజనాలకు వారేమీ ఆర్థికంగా లాభం పొందరు. ఈ డేటా బేస్ ఆధారంగా మరింత విలువైన కృత్రిమ మేధ పరికరాలు తయారుచేసే కంపెనీలు, రోజువారీ పనికాకుండా దానికి మించి ఉపయోగపడే డేటా ఇచ్చిన కార్మికులకు చేసే చెల్లింపులకు కొత్త విధానం తయారుచేయాలి. వారి హక్కులకు రుసుము, ఉత్పాదక విలువననుసరించి చెల్లించాలి. ఫాక్టరీలో లలిత కాలర్లు అంచులూ కుడుతూనే ఉన్నారు. తను పంపిన ఫుటేజ్ ఎక్కడో అనోట్ చేయబడి వుంది. తాము కలెక్టు చేసిన ఫుటేజ్ తో తయారుచేయబడ్డ విలువైన ఉత్పాదకతకు వారికీ తగిన పారితోషికం చెల్లించాలి కదా! అన్నప్పుడు లలిత నవ్వుతూ అంటుంది 'ఇప్పుడు మేము చేస్తున్న పనికే పూర్తి వేతనం అందటంలేదు ఇక రోబోలే మా పని చేస్తే మాకు జీతాలిచ్చేదెవరు?` అని.
స్వేచ్ఛానువాదం : అపర్ణ
రిటైర్డ్ ఎల్‌ఐసి ఉద్యోగిని
(ది గార్డియన్ సౌజన్యంతో)








కామెంట్‌లు (0)