శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

వివక్షపై వినూత్న రీతిలో నిరసన

1 గంట క్రితం

kvps
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 16, 2026, 01:05 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- దళితపేట కారణం చూపి మూసివేసిన దేవాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ

ప్రజాశక్తి – కర్నూలు కార్పొరేషన్: దళితపేట కారణం చూపిస్తూ కర్నూలు జిల్లా కోర్టు ఆవరణం, సాయిబాబా సంజీవయ్య నగర్‌లో 30 ఏళ్లుగా మూసివేసిన శ్రీ షిరిడీ సాయిబాబా దేవాలయం ముఖద్వారం వద్ద కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. సామాజిక శంఖారావంలో భాగంగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని సమైక్యత దినోత్సవంగా పాటిస్తూ శనివారం ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. కెవిపిఎస్ జిల్లా నాయకులు డి. గౌస్ దేశాయ్ మాట్లాడుతూ... ‘దక్షిణ షిరిడీ’గా పేరుగాంచిన కర్నూలు సాయిబాబా దేవాలయం ప్రధాన ముఖద్వారాన్ని దళితపేట కారణం చూపి 30 ఏళ్లుగా మూసివేయడం శోచనీయమన్నారు. దళితులను రెండవ తరగతి పౌరులుగా చూడటం సిగ్గుచేటని తెలిపారు. పెద్దపాడులో రచ్చకట్టలపై దళితులను కూర్చోనివ్వక పోవడం, కోడుమూరు మండలం అనుగొండ ప్రభుత్వ బస్టాండులో దళితులకు ప్రవేశం లేకపోవడం, కోసిగి, కౌతాళం, ఆదోని ప్రాంతాలలో నేటికీ రెండు గ్లాసుల పద్ధతి అమలు కావడం, దళితులకు క్షవరం చేయకపోవడం, రహదారుల్లో నడవనివ్వకపోవడం వంటి దురాచారాలు నేటికీ కొనసాగుతున్నాయని వివరించారు. దళిత చైతన్య ప్రచార కార్యక్రమాల్లో భాగంగా గ్రామాలు, కాలనీల్లో ఆటో, జీపు, బైక్ యాత్రలు చేపట్టి ఆగస్టు 24న కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించనున్నట్లు తెలిపారు. నునుపైన రోడ్లు, అందమైన భవనాలు మాత్రమే అభివృద్ధి కాదని, సాటి మనిషిని మనిషిగా చూస్తూ ఆత్మగౌరవంతో జీవించే పరిస్థితి కల్పించడమే నిజమైన అభివృద్ధి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు ఎం. రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి ఎండి. ఆనంద్ బాబు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్