- నూతన వైద్యులకు డైరెక్టర్ రోణంకి గోపాల కృష్ణ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆయుష్ విభాగంలో నూతనంగా విధుల్లో చేరిన వైద్యులు ప్రజాసేవనే పరమావధిగా భావించి, వృత్తిపట్ల పూర్తి నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేస్తూ నాణ్యమైన వైద్య సేవలు అందించాలని డైరెక్టర్ రోణంకి గోపాల్ కృష్ణ సూచించారు. జాబ్ చార్ట్ అమలులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వకుండా, ప్రభుత్వ ప్రజారోగ్య కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని పిలుపునిచ్చారు. నేషనల్ ఆయుష్ మిషన్ (ఎన్‌ఏఎం) ఆధ్వర్యంలో నూతనంగా ఎంపికైన హోమియో, యునానీ వైద్యులకు విజయవాడ ఆటోనగర్‌లోని ఆయుష్ కార్యాలయ సమావేశ మందిరంలో రెండు రోజులుగా నిర్వహించిన శిక్షణ కార్యక్రమం శుక్రవారం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వైద్యులకు విధులు, బాధ్యతలు, జాబ్ చార్ట్ అమలుపై సమగ్ర అవగాహన కల్పించారు. ఆయుష్ హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ల నిర్వహణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నాణ్యమైన వైద్య సేవల అందజేత, ప్రజారోగ్య కార్యక్రమాల సమర్థ అమలు ప్రతి వైద్యుడి బాధ్యత అని రోణంకి గోపాల్ కృష్ణ పేర్కొన్నారు. జాబ్ చార్ట్‌లో నిర్దేశించిన విధులను తప్పనిసరిగా పాటిస్తూ సేవల నాణ్యతను మరింత మెరుగుపర్చాలని సూచించారు. శిక్షణ కార్యక్రమంలో భాగంగా నేషనల్ ఆయుష్ మిషన్ అమలు మార్గదర్శకాలు, అసాంక్రమిక వ్యాధుల (ఎన్‌సీడీ) స్క్రీనింగ్, ఆయుష్ హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఏహెచ్‌ఎంఐఎస్) ద్వారా నివేదికల నమోదు, ప్రజారోగ్య కార్యక్రమాల అమలు వంటి అంశాలపై అధికారులు, నిపుణులు శిక్షణ అందించారు. అనంతరం నూతన వైద్యులకు మెడికల్ క్యాంప్ కిట్లను పంపిణీ చేశారు.








కామెంట్‌లు (0)