శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఖర్గే సభ అనంతరం ‘శుద్ధీకరణ’ కులవివక్షకు నిదర్శనం

2 గంటల క్రితం

kvps
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 15, 2026, 10:19 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- అవమానించిన వారిపై ఎస్ సి,ఎస్ టి అట్రాసిటి కేసు నమోదు

- కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మల్యాద్రి

ప్రజాశక్తి–అమరావతి బ్యూరో : కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పాల్గొన్న సభ జరిగిన ప్రదేశంలోనే ‘శుద్ధీకరణ’ కార్యక్రమాన్ని నిర్వహించడం కులవివక్ష, అంటరానితనానికి నిదర్శనమని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మల్యాద్రి ఖండించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శనివారం ప్రకటనలో డిమాండ్‌ చేశారు.ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ రామ్‌లీలా మైదానంలో ఈనెల 8న మల్లికార్జున ఖర్గే బహిరంగ సభలో పాల్గొన్నారని, అదే ప్రదేశంలో 10న ‘శుద్ధీకరణ’ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు డిఎస్‌ఎంఎం, కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సమర్పించిన లేఖలో పేర్కొన్న విషయాన్ని మల్యాద్రి తెలిపారు. ఈ ఘటన తనను తీవ్రంగా బాధించిందని, రాజ్యాంగం నిషేధించిన అంటరానితనాన్ని అనుభవించాల్సి వచ్చిందని ఖర్గే పార్లమెంట్‌లో ప్రస్తావించినట్లు గుర్తుచేశారు. దేశ అత్యున్నత ప్రజాస్వామ్య సంస్థలో బాధ్యతలు నిర్వహిస్తోన్న దళిత నాయకుడికే ఇటువంటి వివక్ష ఎదురైతే, సామాన్య దళితులు ఎదుర్కొంటున్న వివక్ష, అవమానాలు, అణచివేత ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. సమానత్వ హక్కులు, సామాజిక న్యాయ విలువలను ధిక్కరించే ఇటువంటి చర్యలను ప్రభుత్వం ఉపేక్షించరాదని తెలిపారు.ఘటనకు బాధ్యులుగా పేర్కొంటున్న వ్యక్తులు, సంస్థపై తక్షణమే విచారణ జరిపి ఎస్ సి ఎస్ టి కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనను రాజకీయ వివాదంగా కాకుండా మానవ గౌరవం, సమానత్వం, రాజ్యాంగ హక్కులకు సంబంధించిన తీవ్రమైన సమస్యగా పరిగణించాలని కెవిపిఎస్‌ కోరుతోందన్నారు. ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) జోక్యం చేసుకోవాలని కోరుతూ తాను కమిషన్‌కు లేఖ రాసినట్లు తెలిపారు. తక్షణ విచారణ జరిపి సంబంధిత అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకొని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా చూడాలని కోరినట్లు తెలిపారు.కేంద్ర, ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాలు ఘటనపై స్పష్టమైన వైఖరి ప్రకటించి రాజ్యాంగ విలువలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రముఖ దళిత నాయకుడికే కులవివక్ష ఎదురైతే సామాన్య దళితుల పరిస్థితి ఏమిటో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కులవివక్ష, అంటరానితనం నిర్మూలన కోసం కెవిపిఎస్‌ నిరంతరం పోరాడుతుందని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్