- సామాజిక మాధ్యమాలను బ్లాక్ చేయడంపై జగన్
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : డిఎస్‌సి అక్రమాలపై ప్రశ్నించే గొంతులను కూటమి ప్రభుత్వం అణచివేస్తోందని, సామాజిక మాధ్యమాలను బ్లాక్ చేయిస్తోందని వైసిపి అధినేత జగన్ విమర్శించారు. ఈ మేరకు శనివారం ఎక్స్‌లో ప్రకటన చేశారు. డిఎస్‌సి –2025 నియామకాల్లో అక్రమాల వ్యవహారం రోజురోజుకూ మరింత బట్టబయలవుతోందని తెలిపారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి కొత్త ఆధారాలు, వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. వాటిని నిగ్గు తేల్చేందుకు సిబిఐ విచారణకు అంగీకరించాల్సిన ప్రభుత్వం దర్యాప్తును తిరస్కరిస్తోందని, మరోవైపు వాటిపై గొంతెత్తుతున్న ప్రతిపక్షంతో పాటు, కొన్ని మీడియా సంస్థలు, సామాజిక కార్యకర్తలు, వ్యక్తులకు సంబంధించిన సామాజిక పోస్టులు, ఖాతాలను మెటా సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లో నియంత్రిస్తున్నారని విమర్శించారు. ‘చట్టపరమైన ఆదేశాలు’ అంటూ వాటిని తొలగించడంతోపాటు జియోబ్లాక్ చేస్తున్నారని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ వ్యవహారం కేవలం డిఎస్‌సి స్కామ్‌తోనే ఆగిపోవడం లేదని, ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలు, అమలు కాని సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఎన్నికల హామీలు, నిరంకుశత్వం, అధికార దుర్వినియోగంపై ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరినీ లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు. వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులని, రాజకీయంగా ఇబ్బందికరంగా ఉన్నాయనే కారణంతో ప్రతిపక్షం, మీడియా, సామాజిక కార్యకర్తలు, పౌరుల గొంతు నొక్కే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదని తెలిపారు. కొత్తగా వెలుగు చూస్తున్న ఆధారాలు ఒకవేళ అవాస్తవమైతే ప్రజల ముందుకు వచ్చి వాస్తవాలతో వాటిని ఖండించాలని కోరారు. నియంతృత్వ సెన్సార్‌షిప్‌లో భాగంగా నియంత్రించిన ప్రతి సామాజిక మాధ్యమ ఖాతాను, పోస్టును, కంటెంట్‌ను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.







కామెంట్‌లు (0)