ప్రజాశక్తి- ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి: విజయవాడలోని దక్షిణ మధ్య రైల్వే సిగ్నల్, టెలికమ్యూనికేషన్స్ ఇంజనీర్ (సిఎస్ టిఇ) ప్రాజెక్ట్స్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ బాపిరాజును రూ.15 లక్షల లంచం తీసుకుంటుండగా కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) అధికారులు ఆదివారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయనతోపాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. సిబిఐ అధికారుల కథనం ప్రకారం... దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రూ.179.50 కోట్ల విలువైన సిగ్నలింగ్ పనులను రెండు ప్రైవేట్ కంపెనీల జాయింట్ వెంచర్ సంస్థ గడువు కంటే ముందే పూర్తి చేసింది. ఇందుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రావాల్సిన రూ.7 కోట్ల బోనస్ ఫైల్‌ను త్వరగా ఆమోదించడానికి అధికారులు లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ప్రైవేట్ కంపెనీ ఎండీ కుమారుడు శ్రీచంద్ విశాఖ నుండి విజయవాడ వస్తున్న మార్గంలో బాపిరాజుకు రూ.15 లక్షల నగదును లంచంగా అందజేస్తుండగా సిబిఐ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరినీ అరెస్టు చేశారు. వారితో పాటు మరో నలుగురు ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులపైనా, ఇతర గుర్తుతెలియని ప్రభుత్వోద్యోగులపైనా కేసు నమోదు చేశారు. నిందితులకు చెందిన విశాఖపట్నం, విజయవాడ, పిఠాపురం, హైదరాబాద్‌లోని నివాసాల్లోనూ, కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించారు.







కామెంట్‌లు (0)