- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు డిస్మిస్
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మద్యం రవాణా కుంభకోణం కేసులో రాజ్ కెసిరెడ్డి, వాసుదేవరెడ్డిలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వారు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఇప్పటికే ఇడి కస్టడీలో ఉన్నందున, సంబంధిత ప్రక్రియ పూర్తయిన అనంతరం రెగ్యులర్ బెయిల్ కోసం సంబంధిత కోర్టును ఆశ్రయించుకోవాలని స్పష్టం చేసింది. సిజెఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ఇడి కస్టడీ నుంచి నిందితులను తిరిగి సిట్ కస్టడీలోకి తీసుకునేందుకు అవసరమైన ప్రొడక్షన్ వారెంట్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ధర్మాసనం సూచించింది. బెయిల్ పిటిషన్ దాఖలైనప్పుడు సంబంధిత కోర్టు కేసు మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటుందని సిజెఐ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు.
మద్యం రవాణా కుంభకోణం పేరుతో కొత్తగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నిందితులను కస్టడీలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని రాజ్ కేసిరెడ్డి, వాసుదేవ రెడ్డి తరపు న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు. ఇప్పటికే నమోదైన ఎఫ్‌ఐఆర్ ప్రకారం జైలులో ఉన్న సమయంలో కస్టడీకి తీసుకోకుండా, ఇప్పుడు కొత్తగా మరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కస్టడీకి తీసుకోవడం కక్షసాధింపు చర్యల్లో భాగమేనని వాదించారు. అయితే ఇదే ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించి దాఖలైన మరో పిటిషన్‌ను గతంలోనే డిస్మిస్ చేసిన విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. నిన్న ఒక నిర్ణయం తీసుకున్న తరువాత, ఈరోజు దానికి భిన్నమైన నిర్ణయం తీసుకోలేమని స్పష్టం చేసింది.
ఈ కేసు చాలా తీవ్రమైనదని, ఇందులో రాజ్‌కేసిరెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారని సిజెఐ జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. ఇడి దర్యాప్తుతోపాటు మిగిలిన కేసుల విచారణ కూడా సమాంతరంగా కొనసాగితే మంచిదే కదా అని నిందితుల తరపు న్యాయవాదులకు సూచించారు. కస్టడీ ప్రక్రియను ఎందుకు సవాలు చేస్తున్నారని ప్రశ్నించారు.






కామెంట్‌లు (0)