- ఓటర్లను ప్రభావితం చేయడమే : ప్రతిపక్షాలు
వాషింగ్టన్ : అమెరికాలో ఎన్నికల వాతావరణ వెడేక్కింది. త్వరలో మధ్యంతర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎలాగైనా గెలవాలని ట్రంప్ వ్యుహరచన చేస్తున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. డల్లాస్‌లో బుధవారం రాత్రి జరిగిన రిపబ్లికన్ పార్టీ మధ్యంతర ఎన్నికల సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక వాగ్దానం చేశారు. రిపబ్లికన్ పార్టీ ప్రతినిధుల సభతో పాటు సెనేట్‌ను కూడా గెలుచుకుంటే, అమెరికాలోని ప్రతి వయోజన పౌరుడికి ఐదు వేల డాలర్ల చొప్పున (రూ.47 లక్షలు) ‘‘ట్రంప్ డివిడెండ్’’ పేరుతో నగదు అందజేస్తానని ఆయన ప్రకటించారు. అయితే, ఈ ‘డివిడెండ్’ ఇచ్చేందుకు అధ్యక్షుడు ట్రంప్ ఓ షరతు కూడా విధించారు. ఈ డబ్బును అమెరికాలో మాత్రమే ఖర్చు పెట్టాలని స్పష్టం చేశారు. ‘ఈ డబ్బును మీరు కెనడాలో ఖర్చు పెట్టకూడదు. చైనా, జర్మనీ పర్యటనలకు వెళ్లి ఖర్చు చేయకూడదు. అమెరికాలోనే ఈ డబ్బును వినియోగించాలి’ అని అన్నారు. ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి. ఒహాయో రిపబ్లికన్ సెనేటర్ బెర్నీ మొరెనో ఈ ప్రతిపాదనకు మద్దతు తెలుపుతూ, ఎన్నికల అనంతరం డివిడెండ్‌ను ఆమోదించేందుకు చట్టాన్ని సిద్ధం చేస్తానని పేర్కొన్నారు.
భారీ ఆర్థిక భారం - ద్రవ్యోల్బణ భయాలు
జనాభా గణన సంస్థ లెక్కల ప్రకారం అమెరికాలో సుమారు 24 కోట్ల మంది వయోజనులు ఉన్నారు. దీని ప్రకారం ఈ పథకం అమలుకు దాదాపు 1.2 లక్షల కోట్ల డాలర్ల (1.2 ట్రిలియన్) వ్యయం అవుతుందని అంచనా. కొత్త ఆదాయ మార్గాలు లేదా వ్యయ కోతలు లేకుండా ఈ చెల్లింపులు చేపడితే, 2026 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 1.8 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న సమాఖ్య బడ్జెట్ లోటు మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే ఇది ద్రవ్యోల్బణ ఒత్తిడిని కూడా పెంచవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఓటింగ్ సరళిని ప్రభావితం చేసేలా ట్రంప్ ఇలా బహిరంగంగా ఓటర్లకు డబ్బు ఆశ చూపించడం అమెరికాలో కలకలానికి దారి తీసింది. ఓటర్లను డబ్బులతో ప్రభావితం చేయడం ఫెడరల్ చట్టాలను ఉల్లంఘించడమేనని ప్రతిపక్షాలు విమర్శించాయి.







కామెంట్‌లు (0)