- ఆలోచనలతో పాటు అమలూ ఉండాలి
- వన్ స్టేట్-వన్ విజన్-వన్ టీమ్-వన్ మిషనే స్వర్ణాంధ్ర
- జిల్లాకు 25, నియోజకవర్గానికి 10-15 ప్రాధాన్యతాంశాలను గుర్తించాలి
- జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : శాఖలు, అంశాలపై గంటల తరబడి సమీక్షలు చేయడం కాదని, తనకు ఫలితం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లు, అధికారులకు నిర్దేశించారు.రెండు రోజులపాటు జరగనున్న 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన గురువారం ప్రారంభమైంది. తొలిరోజు ఆయన ప్రారంభోపన్యాసం చేస్తూ కలెక్టర్లు ఈగోలకు పోకుండా ప్రజా సేవకులుగా ఉండాలని అన్నారు. శాఖలు మధ్య, జిల్లాల మధ్య,శాఖ కార్యదర్శుల మధ్య పోటీ పెరగాలని సూచించారు.ప్రభుత్వాన్ని మభ్యపెట్టే నివేదికలు వద్దని వాస్తవాలు చెప్పాలని ఆదేశించారు. మెరుగైన పాలసీలు అమలు చేయాలని తెలిపారు. 27 నెలల్లో అనేక వ్యవస్థాగత మార్పులు చేశామని, ఆ ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పారు. 28 కొత్త పాలసీలతో అవకాశాలు కల్పించామన్నారు. రియాక్టివ్ గవర్నెన్స్ నుంచి ప్రో యాక్టీవ్ గవర్నెన్స్‌కు వెళ్లాలని చెప్పారు. ఫైల్ పెండింగ్ అంటే అభివృద్ధి పెండింగే అని, ఫిర్యాదు పెండింగ్ అంటే ప్రజలకు న్యాయం పెండింగ్ అని తెలిపారు. విజన్ ఉన్నా దాన్ని అమలు చేయకుంటే అవి నెరవేరని ఆశలుగానే మిగిలిపోతాయని అన్నారు. సమస్యను దాచిపెట్టకుండా చర్చిస్తేనే పరిష్కారం లభిస్తుందన్నారు. సాధారణ పరిపాలన కాదని, ప్రజలు మెచ్చే సుపరిపాలన కావాలని అన్నారు. స్వర్ణాంధ్ర అంటే ‘వన్ స్టేట్-వన్ విజన్-వన్ టీమ్-వన్ మిషన్’ అని అన్నారు. గతంలో 50 ఏళ్లలో చేసే అభివృద్ధిని ఇప్పుడు 10-15 ఏళ్లలోనే సాధించేందుకు ఆస్కారం ఉందని, వనరులు, టెక్నాలజీ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. రాయలసీమ రైజింగ్, కోస్తాంధ్ర భవిష్యత్ కొత్త పుంతలు, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు పేరిట ప్రగతి కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. హంద్రీనీవా, వెలిగొండ ఫేజ్ -1, పోలవరం ఎడమ కాలువ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టులు పూర్తిచేశామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికల్లా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలోని భౌగోళిక అసమానతల కారణంగా కొన్ని ప్రాంతాల్లో నీటి ఒత్తిడి ఉందని, దానిని సరిచేస్తూ ఆయా ప్రాంతాలకు నీటిని ఇవ్వగలిగితే కలిగే సంతోషం వేరని తెలిపారు. గోదావరి- కావేరీ- మహానది- గంగా వంటి నదులు అనుసంధానమై వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తే భారత అభివృద్ధి అన్ స్టాపబుల్ అని చెప్పారు. 36 నీటి ప్రాజెక్టులు చేపట్టేందుకు క్యాలెండర్ కూడా ఇచ్చామని, వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రతి జిల్లాలోనూ 25 టాప్ ప్రాజెక్టులను గుర్తించి, నియోజకవర్గానికి 10-15 ప్రాజెక్టులను ప్రాధాన్యతగా గుర్తించి అభివృద్ధి చేయాలని చెప్పారు. క్షేత్రస్థాయిలో ప్రజలను కలిసి వారికి అందుబాటలో ఉంటూ సమస్య పరిష్కారంపై సత్వరం స్పందించాలని వెల్లడించారు. జిల్లా కలెక్టర్లుగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆ జిల్లాపై తమ ముద్ర వేసుకునేలా పనిచేయాలని చెప్పారు. ప్రతి మూడు నెలలకూ జీఎస్డీపీని కూడా లెక్కించి ప్రగతిలో ఎక్కడ ఉన్నామో చూస్తున్నామని తెలిపారు. 2022-23 బేస్ ఇయర్‌గా ప్రస్తుత ధరలకు అనుగుణంగా 13.44 శాతం వృద్ధి రేటు నమోదైందని పేర్కొన్నారు. దీనిని 15 నుంచి 20శాతం దిశగా తీసుకెళ్దామన్నారు. రెవెన్యూ శాఖలో సంస్కరణల్ని అమలు చేస్తున్నామని, 2027 నాటికి భూ వివాదాలు లేని రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత అందరిది అని చెప్పారు. గత ప్రభుత్వం నిర్వాకంతో మార్కెట్టులోకి వచ్చిన జే బ్రాండ్ మద్యం వల్ల 30 వేల మంది చనిపోయారని వ్యాఖ్యానించారు. కల్తీ బ్రాండ్లన్నీ రద్దు చేసి పారదర్శకంగా విక్రయాలు జరిగేలా చూస్తున్నామని చెప్పారు. ఎకనమిక్ టైమ్స్‌లో చంద్రబాబును ‘వాటర్ మ్యాన్’గా పేర్కొంటూ వచ్చిన ఆర్టికల్‌పై ఆర్థిక శాఖమంత్రి పయ్యావుల కేశవ్ ప్రస్తావించగా సదస్సు అభినందిస్తూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్, డిజిపి హరీష్ కుమార్ గుప్తా, మంత్రులు అనగాని సత్యకుమార్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మీ తదితరులు ప్రసంగించిన ఆ కార్యక్రమంలో మంత్రులు నారాలోకేష్, అచ్చెన్నాయుడు, పి నారాయణతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)