గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

దారప్ప వాంగ్మూలం నమోదు చేయండి

20 జూన్, 2026

ap high court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 20, 2026, 11:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి : మాల గంగమ్మ మరణానికి సంబంధించిన వ్యవహారంలో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బేగరి దారప్ప వాంగ్మూలాన్ని నమోదు చేయాలని సంబంధిత జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌ను హైకోర్టు ఆదేశించింది. అవసరమైతే దారప్ప చికిత్స పొందుతున్న ఆస్పత్రికే వెళ్లి, వైద్యుడి ఫిట్‌నెస్ ధ్రువీకరణ అనంతరం వాంగ్మూలాన్ని నమోదు చేయాలని సూచించింది. ఒకవేళ ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయితే వెంటనే మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచాలని పేర్కొంది. నమోదు చేసిన వాంగ్మూలాన్ని ఈ నెల 23న కోర్టు ముందుంచాలని ఆదేశించింది. దారప్ప వాంగ్మూలం నమోదు చేయాలని కోరుతూ కాసుకుర్తి ఆగమన్రాజ్ దాఖలు చేసిన పిటిషన్ను చీఫ్ జస్టిస్ లీసా గిల్, జస్టిస్ నైనాల జయసూర్యతో కూడిన ధర్మాసనం విచారించింది. కర్నూలు జిల్లా కౌతాళం మండలం బదినేహాల్ గ్రామానికి చెందిన గంగమ్మ తన కుమారుడు వీరేంద్ర అదృశ్యానికి సంబంధించి గతంలో హైకోర్టును ఆశ్రయించగా, ఆ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసిన విషయం పిటిషనర్ ప్రస్తావించారు. సిట్ విచారణ సమయంలో గంగమ్మ మరణించగా, దారప్ప తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ఈ వ్యవహారంలో ఆయన కీలక సాక్షి కావడంతో వాంగ్మూలాన్ని నమోదు చేయాలని కోరారు.

విచారణ సందర్భంగా దారప్ప ఆరోగ్య పరిస్థితిపై ధర్మాసనం ఆరా తీసింది. పోలీసుల తరపున హాజరైన ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది మాట్లాడుతూ.. దారప్ప ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని కోర్టుకు నివేదించారు. అనంతరం ధర్మాసనం పై విధంగా ఆదేశాలు జారీ చేస్తూ, రిట్ పిటిషన్‌తో పాటు ఉత్తర్వుల ప్రతిని సంబంధిత మెజిస్ట్రేట్‌కు పంపాలని రిజిస్ట్రీని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్