శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పీలేరులో ఎర్రచందనం స్మగ్లర్ల హల్‌చల్‌

1 గంట క్రితం

smuggling
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 08:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- అటవీ అధికారుల వాహనాన్నే ఢీకొట్టి పరారికి యత్నం

- 67.9 కిలోల ఎర్రచందనం దుంగలు స్వాధీనం

ప్రజాశక్తి-పీలేరు: పీలేరు మండలంలో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న వాహనాన్ని అటవీ అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేయగా, స్మగ్లర్‌ అధికారుల ప్రభుత్వ వాహనాన్నే ఢీకొట్టి పరారయ్యేందుకు యత్నించాడు. అప్రమత్తమైన అటవీ సిబ్బంది వాహనాన్ని చుట్టుముట్టి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వాహనంతో సహా సుమారు 67.9 కిలోల బరువున్న నాలుగు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పీలేరు అటవీశాఖ క్షేత్రాధికారికి అందిన రహస్య సమాచారం మేరకు శుక్రవారం పీలేరు రేంజ్‌ అధికారి ఆధ్వర్యంలో సెక్షన్‌ సిబ్బంది, బేస్‌ క్యాంప్‌ వాచర్లు అప్రమత్తమయ్యారు. పీలేరు మండలం, జాండ్ల గ్రామం వద్ద మాటువేసి కాపు కాశారు. యల్లమంద వైపు నుంచి వేగంగా వచ్చిన అనుమానిత వాహనాన్ని అటవీ సిబ్బంది ఆపేందుకు ప్రయత్నించగా, ఆ డ్రైవర్‌ తన వాహనంతో అటవీ శాఖ అధికారులు వినియోగించిన ప్రభుత్వ వాహనాన్ని ఢీకొట్టి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వాహనాన్ని చుట్టుముట్టి డ్రైవర్‌ను పట్టుకున్నారు. ఆ వాహనాన్ని తనిఖీ చేయగా అందులో నాలుగు ఎర్రచందనం దుంగలు లభించాయి. వీటి మొత్తం బరువు 67.9 కిలోలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వాహనం, ఎర్రచందనం దుంగల విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ఈ దాడిలో పీలేరు సెక్షన్‌ అధికారి సబియా సుల్తానా, బీట్‌ అధికారులు రెడ్డి సిపాయి, డి. చంద్రకళ, కె. జగదీష్‌, టి. శ్రీనివాసన్‌, డ్రైవర్‌ నాగేంద్ర, బేస్‌ క్యాంప్‌ సిబ్బంది అంజి, చంద్ర, రెడ్డి కుమార్‌, నవీన్‌, మస్తాన్‌ సాహెబ్‌ తదితరులు పాల్గొన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై అటవీశాఖ ఉక్కుపాదం మోపుతోందని, అక్రమ రవాణాకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని అధికారులు హెచ్చరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్