శుక్రవారం, 14 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

శాసన సభ సమావేశాల నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు

59 నిమిషాల క్రితం

ap
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 15, 2026, 12:19 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- ప్రశ్నలకు సత్వరమే సమాధానాలు అందించాలి

- శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు, శాసన సభాపతి అయ్యన్నపాత్రుడు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : శాసన సభ వర్షాకాల సమావేశాలను ప్రశాంతంగా, సమర్థవంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను చేపట్టాలని శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు, శాసన సభాపతి అయ్యన్నపాత్రుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని శాసన సభ ప్రాంగణంలో శాసన మండలి, శాసన సభ సమావేశాల నిర్వహణకు సంబంధించి సాధారణ ఏర్పాట్లు, పరిపాలనా అంశాలు, సభ్యులకు అందించాల్సిన సేవలు, శాంతిభద్రతలు, పోలీస్ బందోబస్తు తదితర అంశాలను సమీక్షించేందుకు సర్వీసెస్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. రావత్, సాధారణా పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు, అదనపు డిజిపి మధుసూదన రెడ్డితో శుక్రవారం వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు, శాసన సభాపతి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. సభా సమావేశాల్లో సభ్యులు అడిగే ప్రశ్నలకు నిర్ణీత సమయంలో సమాధానాలు అందించడం అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశమని పేర్కొన్నారు. అయితే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండటం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖల నుంచి సకాలంలో, స్పష్టంగా, సమగ్రంగా సమాధానాలు అందేలా పటిష్టమైన సమన్వయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సమాధానం ఇవ్వడానికి వీలుకాని ప్రశ్నలు ఏవైనా ఉంటే, అందుకు గల కారణాలను స్పష్టంగా తెలియజేస్తూ సంక్షిప్త సమాధానం అందించాలని సూచించారు. సభా సమావేశాల సందర్భంగా మంత్రులు, సంబంధిత శాఖల తరఫున ఇచ్చే హామీల అమలుపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని వారు అధికారులకు సూచించారు. సభలో ఇచ్చిన హామీలను సంబంధిత శాఖలు నిర్ణీత కాలవ్యవధిలో అమలు చేసేలా పర్యవేక్షణ, సమీక్షకు స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని ఆదేశించారు. సభా హామీల అమలులో జాప్యం జరగకుండా సంబంధిత శాఖల మధ్య సమన్వయం పెంచడంతో పాటు, హామీల స్థితిగతులను ఎప్పటికప్పుడు సమీక్షించే విధంగా పటిష్టమైన వ్యవస్థను అమలు చేయాలని సూచించారు. శాసన మండలి, శాసన సభ సభ్యులకు సంబంధించిన సంక్షేమ అంశాలపై కూడా వారు అధికారులతో చర్చించారు. సభ్యుల పెండింగ్ మెడికల్ బిల్లుల చెల్లింపులను సత్వరమే పరిష్కరించి, అర్హత కలిగిన క్లెయిమ్‌లకు ఎటువంటి జాప్యం లేకుండా చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా సభ్యుల పింఛను సొమ్మును పెంచేందుకు పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలను కూడా సత్వరమే పరిశీలించి, అవసరమైన ప్రక్రియను పూర్తి చేసి ఒక కొలిక్కి తీసుకురావాలని శాసన మండలి అధ్యక్షులు, శాసన సభ స్పీకర్ అధికారులకు సూచించారు. సభ్యుల పింఛను పెంపు అంశానికి సంబంధించి ప్రస్తుతం ఉన్న ప్రతిపాదనల స్థితిగతులు, అవసరమైన పరిపాలనా చర్యలు, ఆర్థికపరమైన అంశాలను సమీక్షించి, వీలైనంత త్వరగా తగిన నిర్ణయానికి రావాలని ఆదేశించారు. అనంతరం పోలీస్ ఉన్నతాధికారులతో శాంతిభద్రతలు, భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్