ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం డిమాండ్
విశాఖ కలెక్టరేట్ ఎదుట నిరసన
ప్రజాశక్తి - కలెక్టరేట్ (విశాఖపట్నం) : సముద్రంలో వేటకు వెళ్లి బోటు బోల్తా పడి గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందివ్వాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో బాధిత మత్స్యకార కుటుంబాలు గురువారం సాయంత్రం విశాఖ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపాయి. అనంతరం కలెక్టర్ అభిషిక్త్ కిషోర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎం.సుబ్బారావు మాట్లాడుతూ... సముద్రంలో గల్లంతయిన మత్స్యకారుల కుటుంబాలు తీవ్ర ఆర్థిక సామాజిక ఇబ్బందుల్లో ఉన్నాయన్నారు. వారికి ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయం రూ.పది లక్షలు ఏమాత్రమూ సరిపోదని తెలిపారు. కనీసం రూ. 25 లక్షలు తగ్గకుండా ఆర్థిక సాయం అందివ్వాలని కోరారు. వారి పిల్లల చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని, బాధిత మత్స్యకార కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగావకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. మత్స్యకారులను ప్రభుత్వం నిర్లక్ష్యంగా, హీనంగా చూడటం తగదన్నారు. గతంలో మత్స్యకారుల ఇళ్లకు వెళ్లి ప్రచారం చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు వారి సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని విమర్శించారు. ప్రమాదంలో బయటపడిన బోటు యజమాని, డ్రైవర్ కారి చిన్నా బోటుకు రూ.60 లక్షల పరిహారం ఇవ్వాలని, ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. తాము కోరిన విధంగా మత్స్యకారులను ఆదుకోకపోతే మరో 15 రోజుల్లో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు యు.సోమేశ్, బాధిత మత్స్యకారులు కారి నర్సియమ్మ, బి.లక్ష్మి, కె.మౌనిక, మసేనమ్మ, ఎ.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)