శనివారం, 19 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అసెంబ్లీ నిర్మాణానికి రూ.661 కోట్లు

17 గంటల క్రితం

ap assembly
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 18, 2026, 11:33 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- పరిపాలనా పరమైన ఆమోదం

- సిఆర్‌‌డిఏ అథారిటీ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి నారాయణ

- మలి విడత ల్యాండ్ పూలింగ్ రైతులకు కనీస కౌలు రూ. 40వేలు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాజధాని అమరావతి నడిబొడ్డున అత్యంత ఎత్తైన భవన నిర్మాణాల్లో ఒకటైన అసెంబ్లీ(ఐకానిక్ భవనం) స్పైర్(250 మీటర్లు) నిర్మాణానికి టెండర్లు పిలవడానికి రూ.661 కోట్లకు పరిపాలనామోదం ఇచ్చినట్లు పట్టణాభివృద్దిశాఖ మంత్రి నారాయణ తెలిపారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఆర్‌‌డిఏ 66వ అథారిటీ నిర్ణయాలను వెల్లడించారు. మలి విడత ల్యాండ్ పూలింగ్ రైతులకు కనీస కౌలు రూ. 40వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో సైతం మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఒక వ్యక్తికి 135 లీటర్లు అందించడానికి అవసరమైన పైపుల సామర్థ్యం పెంపు, మెయిన్ డ్రైనేజీకి లింక్ డ్రైనేజీ పైపులు ఏర్పాటు, ఎన్ఎస్పీ(నెగోషియేటివ్ సెటిల్మెంట్ పాలసీ)తో కలిపి రూ. 1548 కోట్లుతో టెండర్లు పిలవడానికి పరిపాలనా అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. స్టాండర్ట్స్ ప్రైవేట్ స్కూల్స్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చామని పేర్కొన్నారు. అందులో భాగంగానే నలందా ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్కు ఐదు ఎకరాలు కృష్ణాయపాలెంలో ఇచ్చామని, ఏడాదిన్నరలో స్కూల్ నిర్మాణం పూర్తవనుందని మంత్రి తెలిపారు. హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ కార్యాలయ నిర్మాణానికి నేలపాడులో 50 సెంట్లు భూమి కేటాయించామని చెప్పారు. ల్యాండ్ పూలింగ్ కు భూములు ఇచ్చిన రైతులకు ఎకరాకు కౌలు జరీబు అయితే రూ. 50 వేలు, నాన్ జరీబు అయితే రూ. 40వేలు అందిస్తున్నామన్నారు. 2014-19 మధ్యలో భూ సమీకరణలో భాగంగా భూములు ఇచ్చిన ఎకరం కంటే తక్కువ ఉన్నా గతంలో వారికి రూ. 30 వేలు ఇచ్చామన్నారు. రెండో విడత భూ సమీకరణ సందర్భంగా రైతుల విజ్ఞప్తి మేరకు వారికి కూడా కౌలు రూ. 40వేలు ఇవ్వడానికి అథారిటి అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. అక్టోబర్ చివరి నాటికి రెవెన్యూ సమస్యలను సైతం పరిష్కరించి ల్యాండ్ పూలింగ్ 80 శాతం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్