శనివారం, 19 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘ఎలక్ట్రిక్‌ బస్సుల నిర్వహణ ఆర్‌‌టిసికే’

17 గంటల క్రితం

apsrtc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 18, 2026, 11:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: రాష్ట్రంలో రెండో దశలో ప్రవేశపెట్టనున్న 1,450 ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణను ప్రయివేటు ఆపరేటర్లకు అప్పగించే ఆలోచనను విరమించుకోవాలని ఎపి పిటిడి(ఆర్‌‌టిసి) ఉద్యోగ సంఘాల జెఎసి డిమాండ్‌ చేసింది. ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం, ఆర్ టిసి నేరుగా కొనుగోలు చేసి, ఉద్యోగులతోనే నిర్వహించాలని కోరింది. ఈ మేరకు జెఎసి కన్వీనర్లు వై శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదరరావు ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్‌ ‌టిసి వైస్‌ ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (అడ్మిన్‌ అండ్‌ ఇంజినీరింగ్‌)కు వినతిపత్రాలను అందించారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెట్టడాన్ని తాము వ్యతిరేకించడం లేదని జెఎసి నాయకులు తెలిపారు. వాటి నిర్వహణను ప్రయివేటు సంస్థలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. ప్రయివేటు ఆపరేటర్ల ఆధీనంలో బస్సుల నిర్వహణ కొనసాగితే భవిష్యత్తులో ఆర్‌‌టిసి ప్రయోజనాలు, ఉద్యోగుల ఉపాధి భద్రతపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్‌‌టిసి ఉద్యోగ సంఘాల జెఎసితో గతంలో కుదిరిన ఒప్పందాలకు సంబంధించి ప్రభుత్వం వెంటనే ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఆర్‌‌టిసిని ప్రజా రవాణా సంస్థగా మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ఎలక్ట్రిక్‌ బస్సులన్నింటినీ ఆర్‌‌టిసి యాజమాన్యంలోనే నడిపేలా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై గతంలోనే ప్రభుత్వం, ఆర్‌‌టిసి యాజమాన్యం దృష్టికి తమ అభ్యంతరాలను తీసుకెళ్లామని తెలిపారు. అయినప్పటికీ ప్రయివేటు విధానంలో ముందుకు వెళ్లే ప్రయత్నాలు కొనసాగించడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఆర్‌‌టిసి పరిరక్షణ, ఉద్యోగుల ఉద్యోగ భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని జెఎసి కన్వీనర్లు స్పష్టం చేశారు. అవసరమైతే భవిష్యత్‌ కార్యాచరణపై జెఎసి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జెఎసి కో కన్వీనర్లు పివి రమణారెడ్డి, జివి నరసయ్య, సిహెచ్ సుందరయ్య, కట్టా సుబ్రహ్మణ్యం, ఎస్‌ వి శేషగిరిరావు, వై శ్రీనివాసరావు, కె సూర్యప్రకాశరావు, జి మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్