- కెవిపిఎస్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జాతీయ ఎస్ సి కమిషన్ కు మరిన్నీ అధికారాలు కల్పించాలని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మల్యాద్రి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ ఎస్ సి కమిషన్ సూచనలు, సిఫార్సులు మాత్రమే చేయగలదని, న్యాయపరమైన, బంధనాత్మక ఆదేశాలు జారీ చేసే అధికారం లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. దేశంలో దళితులపై దాడులు, కులవివక్ష, భూకబ్జాలు, సామాజిక బహిష్కరణ, ఎస్ సి, ఎస్ టి అఘాయిత్యాల నిరోధక చట్టం అమల్లో నిర్లక్ష్యంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎస్ సి కమిషన్‌కు సిఫార్సులకే పరిమితమైన అధికారాలు ఉండటం దురదృష్టకరమని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థగా ఉన్న ఎస్ సి కమిషన్‌ను బలోపేతం చేసి, దాని సిఫార్సులను అమలు చేసేలా చట్టపరమైన మార్పులు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దళితుల రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు కమిషన్‌కు మరింత సమర్థవంతమైన అధికారాలు కల్పించడం అత్యవసరమని పేర్కొన్నారు.సామాజిక న్యాయం, సమానత్వం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.







కామెంట్‌లు (0)