అడుగడుగునా పోలీసుల అడ్డంకులు
ఎక్కడికక్కడ బైఠాయింపు.. పలువురి అరెస్టు
ప్రజాశక్తి-విజయవాడ : సచివాలయ ఉద్యోగుల నిరసనతో విజయవాడలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పెద్ద సంఖ్యలో సచివాలయ ఉద్యోగులు లెనిన్ సెంటర్ వైపు తరలిరావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. లెనిన్ సెంటర్‌కు వచ్చే అన్ని మార్గాలను పోలీసులు మూసివేశారు. ఉద్యోగులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. వారు ఎక్కడ పోలీసులు నిలువరించారో అక్కడే బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన చేస్తున్న సచివాలయ ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు పోలీసుల తీరుపై, ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఉద్యోగుల నిరసన నేపథ్యంలో లెనిన్ సెంటర్ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు.
గన్నవరం వద్ద బస్సును నిలిపివేసిన పోలీసులు
ఛలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొనేందుకు తణుకు నుంచి బయలుదేరిన సచివాలయ మహిళా ఉద్యోగులను గన్నవరం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. సుమారు 60 మంది ఉద్యోగులు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో విజయవాడకు బయలుదేరారు. గన్నవరం వద్ద పోలీసులు బస్సును నిలిపివేసి వారిని ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు. తమను ఎందుకు నిలువరిస్తున్నారో పోలీసులు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.










కామెంట్‌లు (0)