రాంచీ : జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ (జెఎస్‌ఎస్‌సి-సిజిఎల్)-2023 పరీక్షల్లో అవతవకలకు సంబంధించి ఆదివారం సిఐడి ముగ్గురు అభ్యర్థులను అరెస్టు చేసింది. తాజా అరెస్టులతో ఈకేసులో మొత్తం అరెస్టయిన వ్యక్తుల సంఖ్య 19కి చేరింది.
కొడెర్మా జిల్లాకు చెందిన అజయ్ కుమార్, గిరిదిహ్ జిల్లాకు చెందిన సంజయ్ కుమార్, రామకృష్ణ కుమార్‌లను అరెస్టు చేసినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. జెఎస్‌ఎస్‌సి-సిజిఎల్ పరీక్షల్లో ఈ అభ్యర్థులు అక్రమ ప్రయోజనాలు పొందారని పేర్కొన్నారు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జెపిఎస్‌సి), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (జెఎస్‌ఎస్‌సి) నిర్వహించిన పరీక్షలను రద్దు చేయాలని, అక్రమాలపై సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు జులై 25నుండి ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. జెఎస్‌ఎస్‌సి-సిజిఎల్ సహా పలు రిక్రూట్‌మెంట్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఆగస్ట్ 18న ప్రభుత్వం ప్రకటించింది. అనంతరం ప్రభుత్వం నిర్ణయంపై జార్ఖండ్ హైకోర్టు స్టే విధించింది.








కామెంట్‌లు (0)