మంగళవారం, 15 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నెలాఖరు వరకు ఎస్‌ఐఆర్‌ను పొడిగించండి

2 గంటల క్రితం

ceo .jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 12:41 పూర్వాహ్నం | 5 నిమిషాల చదవడం

  • ‘ఆ ’జాబితాలు ప్రకటించండి

  • సిఇఓకు ఓటు పరిరక్షణ వేదిక వినతి

  • వలస వెళ్లిన వారిని ఆచూకీ లేనివారిగా ప్రకటించడం అప్రజాస్వామికం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ఈ నెలాఖరు వరకు పొడిగించాలని, ఓట్లు తొలగింపునకు గురైన, నోటీసులు జారీయైన వారి లిస్టులను బహిరంగ పర్చాలని, జాబితా రాజకీయ పార్టీలకు ఇవ్వాలని ఓటు పరిరక్షణ వేదిక కోరింది. ఈ మేరకు మంగళవారం వేదిక కన్వీనర్‌ ‌సుంకర రాజేంద్రప్రసాదు, నాయకులు ఎ.బి.వెంకటేశ్వ రరావు, కె.ఎస్‌.లక్ష్మణరావు, బి.శ్రీనివాసరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య, వైసిపి సీనియర్‌ ‌నాయకులు మల్లాది విష్ణు, కాంగ్రెస్‌ ‌నాయకులు కె.శివాజీ, న్యూడెమోక్రసీ నాయకులు పి.ప్రసాదు, ఎం.రామకృష్ణ, సిపిఐఎంఎల్‌ ‌లిబరేసన్‌ ‌నాయకులు ఎ.ఉదయకిరణ్‌, ఫార్వార్డ్‌ ‌బ్లాక్‌ ‌నాయకులు పి.వి.సుందరరామరాజు, ఎస్‌‌యుసిఐసి నాయకులు అమర్‌‌నాథ్‌, విసికె పార్టీ నాయకులు విద్యాసాగర్‌, డిబిఎఫ్‌ ‌నాయకులు కొరివి వినయ్‌‌కుమార్‌ చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారికి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్‌ఐఆర్ ప్రక్రియ వల్ల తొలిదశలో 44.89 లక్షల మంది ఓట్లు ముసాయిదా జాబితాలో లేకుండా పోయాయని తెలిపారు. 15.22 లక్షల ఓట్లను మృతి చెందిన వారిగా గుర్తించారని, మరో 7.37 లక్షల ఓట్లను రెండు, మూడు చోట్ల నమోదైన ఓట్లుగా ప్రకటించారని పేర్కొన్నారు. 22.30 లక్షల ఓట్లను ఆచూకీ లేనివారిగా ప్రకటించారని తెలిపారు. మరణించిన వారు, డబుల్ ఎంట్రీ ఓట్లుగా పేర్కొన్న వాటిలో కూడా కొన్ని లోపాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని తెలిపారు. 22 లక్షలకు పైగా వలస వెళ్లిన వారిని ఆచూకీ లేనివారిగా ప్రకటించి వారికి ఓటు హక్కు లేకుండా చేయడం అప్రజాస్వా మికమని వివరించారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించిన అనంతరం మరో 44,21,763 మందికి సాంకేతిక, చిన్న, చిన్న కారణాలు, సాకుల తో మరో 7.3 లక్షల ఓట్లు మ్యాపింగ్ కాని ఓట్లుగా నోటీసులు జారీచేయడంతో ఓటర్లు తీవ్ర మనో వేదనకు గురవుతున్నారని, ఆందోళన చెందుతు న్నారని తెలిపారు. ఇందులో 36 లక్షల మందికి పైగా పేరు, తండ్రి లేదా భర్త పేర్లు, వయసు, చిన్న చిన్న సాంకేతిక లోపాలు ఉన్నాయనే నెపంతో ఈ నోటీసులు జారీ చేయడం గర్హనీయమని పేర్కొన్నారు. ఈ నోటీసుల్లో పొరపాటు సమాచారం ఇస్తే జైలు, కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరిస్తూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. కుటుంబంలో ప్రతి సభ్యుడు ఈ విచారణకు హాజరుకావలసిన పరిస్థితి తలెత్తిందని, తమ వృత్తులు మానుకొని అధికారులు, కార్యాలయాలు చుట్టూ తిరగవలసిన దుస్థితి ఏర్పడిందని వివరించారు. ఉపాధి, చదువు ఇతర కారణాలతో దూరప్రాంతాల్లో ఉన్నవారు విచారణకు రాలేక మరింత ఆందోళనకు గురవుతున్నారని, వారి ఓటు హక్కు పోతుందనే భయాందోళనకు లోనవుతున్నారని పేర్కొన్నారు. ఓటర్ల వద్ద ఉన్న ప్రభుత్వం ఇచ్చిన ఆధార్ (గుర్తింపుకోసం తప్ప ఇతర వివరాలు పరిగణనలోకి తీసుకోదు), రేషన్, ఓటు కార్డులను పరిగణనలోకి తీసుకోకుండా పాస్ పోర్ట్, జనన ధ్రువీకరణ, కుల సర్టిఫికెట్లు ఇతర అందుబాటులోలేని సర్టిఫికెట్లు తేవాలని నిబంధనలు పెడుతున్నారని వివరించారు. 2002 తాజా ఓటర్ల జాబితాల్లో అక్షర దోషాలకు ఎన్నికల సంఘం బాధ్యత వహించాలని పేర్కొన్నారు. తప్పు అధికారులది అయితే ఓటర్లను శిక్షించడం తగదని సూచించారు. తాత, తండ్రి, ఓటరు వయసు వ్యత్యాసాలు తక్కువగా ఉన్నాయని, ఎక్కువగా ఉన్నాయని చెబుతూ నోటీసులు ఇవ్వడం, వారి పుట్టుకనే ప్రశ్నించడం వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నదని, మనోవేదనకు గురిచేస్తున్నదని తెలిపారు. విచారణకు హాజరైన వారిని పత్రాలతో, పలకలు పెట్టి నేరస్తులను ఫోటోలు తీసినట్టు ఫోటోలు తీయడం తీవ్ర అభ్యంతరకరమని వివరించారు. పలుచోట్ల నోటీసులు ఇవ్వకుండానే ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చి సరిపెడుతున్నారని,

పూర్తి సమాచారం ఓటర్లకు సమగ్రంగా అందటం లేదని తెలిపారు. ఇంకా 2.33 లక్షల మంది నుండి నోటీసులకు సమాధానం రాలేదని, గతంలో సుప్రీం కోర్టు అనేక సందర్భాలలో అక్షరదోషాలను (క్లరికల్ మిస్టేక్స్) సరిదిద్దాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదేనని స్పష్టంగా తీర్పులిచ్చినప్పటికీ దాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో తెలుగును ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉండగా దాన్ని పక్కనపెట్టి ఆంగ్లంలోని అక్షర దోషాలపై నోటీసులివ్వడం రాజ్యాంగ ధిక్కరణేనని తెలిపారు. 2002లో ఏ ఓటరూ స్వయంగా దరఖాస్తు రాసివ్వ లేదని, బిఎల్‌ఓలే ఇంటింటికీ తిరిగి నమోదు చేసుకు న్నారని, అది తెలుగైనా, ఇంగ్లీషయినా బాధ్యత ఎన్నికల సంఘానిదేనని వివరించారు. ఎన్నికల సంఘం అప్రజాస్వామిక నిబంధనల వల్ల రాష్ట్రంలో గతంలో 22 లక్షల మందికి, నేడు మరో 44 లక్షల మంది మొత్తం 66 లక్షల మంది ఓటు హక్కుకు ముప్పు ఏర్పడుతోందని వివరించారు. ప్రజాస్వామ్య ప్రక్రియకు ఇది తీరని హానిచేస్తుందని, సర్ ప్రక్రియను ఓటు హక్కును కాపాడే విధంగా, రాజ్యాంగ స్పూర్తికనుగుణంగా మార్చాలని తెలిపారు. ఓటు నమోదు ప్రక్రియకు గడువు సెప్టెంబర్ ఆఖరు వరకు పొడిగించాలని, 18 సంవత్సరాలు నిండిన అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలని కోరారు. ఇంటింటికీ తిరిగే ప్రత్యేకమైన క్యాంపెయిన్ చేపట్టి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ముట్టినట్లు రశీదు ఇవ్వాలని కోరారు. ఇంటింటికి తిరిగి ఓటు కల్పించడం, జాబితాలో తప్పులు, లోటుపాట్లను సరిదిద్దే బాధ్యత ఎన్నికల సంఘం తీసుకోవాలని తెలిపారు. ఓటర్ల విచారణకు, లోపాలు సరిచేయడానికి సమయం పొడిగించాలని, రాష్ట్రంలో 22 లక్షలకుపైగా వలస వెళ్లినవారికి ఓటుహక్కు కల్పించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొత్త ఓటర్ల చేర్పింపు, లోపాలు సరిచేయడం, అడ్రస్ మార్పులు తదితర ప్రక్రియను అధికార యంత్రాంగమే చేపట్టాలని కోరారు. ఓటర్ల విచారణ మౌఖికంగానే కాకుండా వీడియోకాల్ ద్వారా కూడా చేయాలని, సిబ్బంది సంఖ్యను పెంచాలని, అదనపు భారంవేసి వేధించడం మానుకోవాలని కోరారు. ఎన్యూమరేషన్ కాలంలో వారికి ఇతర బాధ్యతలు లేకుండా చూడాలని, నిర్దేశించిన సమయానికి విచారణకు హాజరై రుజువు చేసుకోవాలనే నిబంధనలు తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఓటర్ల వద్ద అందుబాటులో ఉండే ప్రామాణికమైన ఆధార్, రేషన్, ఓటు తదితర ప్రభుత్వం ఆమోదించిన 15 రకాల కార్డులను పరిగణలోకి తీసుకొని అందరికీ ఓటు హక్కు కల్పించాలని, విద్యార్థులు, ఉద్యోగులకు వారి ఐడి కార్డులను ఆమోదించాలని సూచించారు. 2002 ఓటర్ల జాబితాలో నమోదైన పేర్లను ప్రామాణికంగా తీసుకునే నిబంధనలు పూర్తిగా తొలగించాలని తెలిపారు. ఎన్నికల జాబితాలను పారదర్శకంగా ప్రజా పరిశీలనకు ఉంచాలని, ఈ జాబితాలను ఎన్నికల కార్యాలయాలు, గ్రామ/ వార్డు సచివాలయాలు, పోలింగ్ కేంద్రాలు సిఇఓ వెబ్‌సైట్‌లో ప్రజలకు సులభంగా అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు, వారి బూత్ లెవెల్ ఏజెంట్లకు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించే పౌర సంఘాలకు ఈ జాబితాలను డిజిటల్ ముద్రిత రూపాల్లో అందించాలని కోరారు.

ప్రజాస్వామ్యానికి విఘాతం

ఓటు హక్కు లేకుండా చేయడం ప్రజాస్వామ్యానికి విఘాతమని ఓటు పరిరక్షణ వేదిక నాయకులు పేర్కొన్నారు.సిఇఓకు వినతిపత్రం అందచేసిన అనంతరం వేదిక కన్వీనర్‌ ‌సుంకర రాజేంద్రప్రసాద్‌ ‌మాట్లాడుతూ రాష్ట్రంలో చేపట్టిన ఎస్‌ఐఆర్‌ ‌ప్రక్రియలో లక్షల సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం వచ్చిందని తెలిపారు. వారికి న్యాయం చేయాలని సిఇఓను కోరామని చెప్పారు.

ఓట్లు కోల్పోయిన వారిలో ఎక్కువమంది వలస కార్మికులు, పేదలే ఉన్నారని తెలిపారు. అలా వెళ్లినవారి వివరాలు సేకరించి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదేనని తెలిపారు. సెంటర్ ఫర్‌ ‌లిబర్టీ నాయకులు, మాజీ డిజిపి ఎ.బి.వెంకటేశ్వరరావు ఓట్లు తొలగించడంపై ఉన్న శ్రద్ధ ఎన్ని ఓట్లు చేర్చుకోవచ్చు అనే అంశంపై లేదని విమర్శించారు. రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ సర్‌ ‌ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులన్నీ సిఇఓకు వివరించామని, సామాన్యుడు ఓటు హక్కు కోల్పోకూడదు అనేదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ 30 లక్షల మంది వలసలు పోయిన వారు ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ముంచుకు వచ్చిందని అన్నారు. అటువంటి వారిని గుర్తించి ఓటు హక్కు కల్పించేందుకు ఎన్నికల కమిషన్‌ ‌చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఓటు పొందడం ప్రజల హక్కని చెప్పారు. కుట్రపూరిత సర్‌‌ను జనంపై ప్రయోగిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ ప్రజలు కోల్పోయిన ఓట్లను తిరిగి నమోదు చేసే కార్యక్రమం చేపట్టాలని కోరారు. పొరపాట్లకు ఎన్నికల కమిషన్‌ ‌బాధ్యత వహించాలని తెలిపారు. వైసిపి రాష్ట్ర సీనియర్‌ నాయకులు మల్లాది విష్ణు మాట్లాడుతూ నూతన ఓటర్ల ప్రక్రియలో అధికారులు శ్రద్ధ వహించలేదని అన్నారు. ఎవరి ఓటూ పోకూడదనే ఉద్దేశంతో ఓటు పరిరక్షణ వేదిక ఆధ్వర్యాన కార్యాచరణ చేపట్టామని ‌వివరించారు. 23 లక్షల ఓట్లను జాబితాలోకి రాకుండా చూస్తున్నారని విమర్శించారు. అభ్యర్థనలను సరిచేశారా లేదా అనే అంశంపై అధికారులు దృష్టి సారించాలని కోరారు. ఎపిసిసి నాయకులు కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ ఎన్నికల అధికారులు పైవాళ్లు చెప్పింది చేస్తున్నారే తప్ప సమస్యలను చెవికెక్కించుకోవడం లేదని విమర్శించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్