ఎఐసిసి కార్యదర్శులతో రాహుల్, వేణుగోపాల్ భేటీ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత ప్రక్షాళనకు కసరత్తు ప్రారభమైంది. వరుస పరాజయాలు, రాష్ట్రాల్లో బలహీనపడుతున్న పార్టీ యంత్రాంగం, రానున్న ఎన్నికల నేపథ్యంలో అధిష్టానం సంస్థాగత వ్యవస్థను పునర్‌వ్యవస్థీకరించే పనిలో పడింది. అందులో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ మంగళవారం నాడిక్కడ 10 జనపథ్ లో ఎఐసిసి కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా నిరంతరం ప్రజల్లో ఉండేలా పార్టీ వ్యవస్థను రూపొందించాలన్న లక్ష్యంతో నాయకత్వం ముందుకు సాగుతున్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే సచిన్ పైలట్‌కు ఎఐసిసి ప్రధాన కార్యదర్శిగా పంజాబ్ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించగా, గతంలో ఆ బాధ్యతలు నిర్వహించిన భూపేష్ బఘేల్‌ను అస్సాం ఇన్‌చార్జిగా నియమించారు. రణదీప్ సింగ్ సుర్జేవాలాకు గుజరాత్ బాధ్యతలు అప్పగించారు. కర్ణాటక అదనపు బాధ్యతలను ఆయన కొనసాగించనున్నారు. సుఖ్‌దేవ్ భగత్‌కు ఛత్తీస్‌గఢ్, సిరివెళ్ల ప్రసాద్‌కు మహారాష్ట్ర, పివి మోహన్‌కు ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి పార్టీ కార్యకలాపాలు, రాష్ట్రాల వారీగా సంస్థాగత పరిస్థితి, పార్టీ శ్రేణుల సమన్వయం వంటి అంశాలపై చర్చించారు.







కామెంట్‌లు (0)