శనివారం, 19 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వార్డుల పునర్విభజనలో తీవ్ర‌మైన లోపాలు

17 గంటల క్రితం

alla
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 18, 2026, 11:29 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఎస్‌ఈసికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : వార్డుల పునర్విభజనలో తీవ్ర‌మైన లోపాలు ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైసిపి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం లేఖ రాశారు. భౌగోళిక నిబంధనలు పాటించకుండా ఓటర్లను వేర్వేరు వార్డులకు విభజన చేశారని, ప్రసన్నాయపల్లి, తెనాలి మున్సిపాలిటీల్లో అవకతవకలపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. వార్డుల పునర్విభజనపై సమగ్ర సమీక్ష జరిపి లోపాలను సరిదిద్దాలని కోరారు. సవరించిన వార్డు మ్యాప్‌లు, ఓటర్ల జాబితాలను ప్రజల పరిశీలన కోసం ప్రచురించాలని కోరారు. అభ్యంతరాలు పరిష్కారమయ్యే వరకు తుది ప్రక్రియను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. వార్డుల సరిహద్దుల ఖరారులో గుర్తింపు పొందిన కాలనీలు, సహజ సరిహద్దులు, డోర్ నంబర్ల వరుస క్రమాన్ని తగిన విధంగా పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి తమకు అందిన ఫిర్యాదుల ప్రకారం.. ఒకే వీధి, కాలనీ లేదా నివాస ప్రాంతానికి చెందిన ఓటర్లను వేర్వేరు వార్డుల్లోకి విభజించారని లేఖలో పేర్కొన్నారు. అదే సమయంలో భౌగోళికంగా దూరంగా ఉన్న, పరస్పర సంబంధం లేని ప్రాంతాలను ఒకే వార్డులో కలిపినట్లు తెలిపారు. దీనివల్ల ఓటర్లకు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు గందరగోళం, అసౌకర్యం ఏర్పడే పరిస్థితి ఉందని ఆ లేఖ‌లో పేర్కొన్నారు. లేఖ‌తోపాటు ప్రసన్నాయపల్లి నగర పంచాయ‌తీ, తెనాలి మున్సిపాలిటీల్లో వార్డుల పున‌ర్విభ‌జ‌న‌లో జ‌రిగిన అవకతవకలను ఆధారాల‌తో స‌హా రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌కి స‌మ‌ర్పించారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి పంచాయతీని 2026 ఓటర్ల జాబితా ప్రకారం 14 వార్డులుగా విభజించారని అప్పిరెడ్డి తెలిపారు. అయితే ఒకే ప్రాంతానికి, ఒకే కుటుంబాలకు చెందిన ఓటర్లను వేర్వేరు వార్డుల్లోకి చెల్లాచెదురు చేశారని తెలిపారు. కొన్ని వార్డులు గ్రామంలోని వేర్వేరు ప్రాంతాలను కలిపి కవర్ చేస్తున్నాయని, దీనివల్ల స్థానికంగా గందరగోళం నెలకొంటోందని లేఖలో పేర్కొన్నారు. దీంతోపాటు తెనాలి మున్సిపాలిటీలోనూ ఇదే తరహా సమస్యలు ఉన్నాయని అప్పిరెడ్డి తెలిపారు. 2026 ఆగస్టు 14న జారీ చేసిన ప్రొసీడింగ్స్ ద్వారా వార్డుల సంఖ్యను 40 నుంచి 52కి పెంచారని పేర్కొన్నారు. ముఖ్యంగా 28, 30, 35, 42, 52వ వార్డుల్లో లోపాలు గుర్తించినట్లు తెలిపారు. ఒకే చిరునామాలో లేదా ఒకే ప్రాంతంలో నివసిస్తున్న ఓటర్లను వేర్వేరు వార్డుల్లో చేర్చినట్లు లేఖలో పేర్కొన్నారు. వాటిని క్లరికల్ పొరపాట్లుగా పరిగణించరాదని, సమస్యకు సంకేతాలని అప్పిరెడ్డి పేర్కొన్నారు. వార్డుల సరిహద్దులు స్పష్టంగా, భౌగోళికంగా, సులభంగా గుర్తించదగినవిగా, ఓటర్లకు సౌకర్యవంతంగా ఉండేలా నిర్ణయించాల్సిన అవసరం ఉందన్నారు. కమిషన్ క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, అందిన అభ్యంతరాలను నిష్పక్షపాతంగా పరిశీలించి లోపాలను సరిదిద్దాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్