మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionస్పైస్‌జెట్‌కు ఎన్‌‌సిఎల్‌‌టిలో ఎదురుదెబ్బ

19 గంటల క్రితం

SPICE JET - PLANE
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 17, 2026, 10:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • చివరి నిమిషం ఒప్పందంపై ఆగ్రహం

న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌‌టి)లో ఎదురుదెబ్బ తగిలింది. సంస్థపై దాఖలైన ఎనిమిది దివాలా పిటిషన్లపై తీర్పు వెలువరించాల్సిన రోజునే ఓ విమాన లీజు సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించడంపై ఎన్‌సిఎల్‌‌టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరి నిమిషంలో ఒప్పందం గురించి వెల్లడించడం కోర్టు సమయాన్ని వృథా చేయడమేనని వ్యాఖ్యానించింది. ఐబిసి సెక్షన్‌ 9 కింద స్పైస్‌జెట్‌ బకాయిల కోసం ఎనిమిది రుణదాత సంస్థలు 2024లో ఎన్‌సిఎల్‌‌టిలో పిటిషన్లు దాఖలు చేశాయి. సోమవారం తీర్పు వెలువడాల్సి ఉండగా.. పిటిషనర్లలో ఒకటైన ఏవియేటర్‌ ఎంఎల్‌ 29641 లిమిటెడ్‌తో రాజీ ఒప్పందం కుదుర్చుకున్నామని, తొలి విడతగా 5 లక్షల డాలర్లు (సుమారు రూ.4.2 కోట్లు) చెల్లించామని స్పైస్‌జెట్‌ తెలిపింది. దీనిపై స్పందించిన బెంచ్‌.. రాజీ విషయాన్ని ఇంతకాలం ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించింది. మిగిలిన ఏడుగురు రుణదాతల న్యాయవాదులు కూడా స్పైస్‌జెట్‌ తీరును తప్పుపట్టారు. ఒక్క సంస్థతో ఒప్పందం చేసుకుని మిగిలిన పిటిషన్లపై విచారణను జాప్యం చేయడం సరికాదని, తమ కేసుల్లో వెంటనే తీర్పు ఇవ్వాలని కోరారు. అయితే బకాయిలపై స్పష్టత ఇచ్చేందుకు స్పైస్‌జెట్‌కు సమయం ఇచ్చిన ఎన్‌సిఎల్‌‌టి తీర్పును బుధవారానికి వాయిదా వేసింది. మరోవైపు స్పైస్‌జెట్‌ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. 2025 డిసెంబరు 31తో ముగిసిన తొలి తొమ్మిది నెలల్లో సంస్థ నికర నష్టం రూ.1,138.15 కోట్లకు చేరగా, కార్యకలాపాల ఆదాయం 14 శాతం తగ్గి రూ.3,271.5 కోట్లకు పరిమితమైంది. మార్కెట్‌ వాటా 3.9 శాతం నుంచి 1.9 శాతానికి పరిమితమయ్యింది. ఈ ఏడాది ఇప్పటివరకు స్పైస్‌జెట్‌ షేరు సుమారు 61 శాతం పతనమయ్యింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్