- మాజీ సిఎం వైఎస్ జగన్
- నిరాహారదీక్ష శిబిరంపై ఎమ్మెల్యే దాడి అన్యాయం
- దిశ చట్టాన్ని రక్షించాలి
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కుమారుడిని కాపాడుకోవడానికి కూటమి ప్రభుత్వం దిగజారిపోతోందని, నిరుద్యోగ యువతకు, ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే హింసతో సమాధానం చెబుతున్నారని, దీన్ని సహించలేది లేదని మాజీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం దీనిపై సోషల్‌మీడియా వేదిక ఎక్స్‌లో ప్రకటన విడుదల చేశారు. డిఎస్సి 2025 ప్రశ్నాపత్రం లీక్, నియామకాల్లో జరిగిన తీవ్రమైన అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని కోరుతూ విజయవాడలో శాంతియుతంగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షపై టిడిపి ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేసి, దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేశారని తెలిపారు. పోలీసుల కళ్లముందే, వారి సమక్షంలోనే టెంట్లు లాగిపడేశారని, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేయడంతోపాటు మహిళలపై దాడులకు తెగబడ్డారని, రాష్ట్రవ్యాప్తంగా దీక్షా శిబిరాలపై నిర్బంధకాండను కొనసాగించారని తెలిపారు. చిలకలూరిపేట, కనిగిరి, యాడికి, తాడిపత్రి నుంచి పలమనేరు, రేపల్లె, గుంటూరు, పొన్నూరు, వేమూరు, మాచర్ల, గురజాల, కందుకూరు, బాపట్ల వరకు నిరసన శిబిరాలపై దాడులు చేసి నాయకులను నిర్బంధించారని పేర్కొన్నారు. శాంతియుతంగా దీక్షలు చేస్తూ మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును కూడా నిరుద్యోగ యువతకు లేకుండా చేశారని పేర్కొన్నారు. లోకేష్‌ను ఈ కేసు నుండి బయటపడేసేందుకు కూటమి ఎమ్మెల్యేలను, పార్టీ శ్రేణులను, పోలీసు యంత్రాంగాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారని ప్రశ్నించారు. పారదర్శకంగానే జరిగిందని చెబుతున్నప్పుడు సిబిఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని కోరారు. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడి చదివిన యువతకు న్యాయం జరగాలి. నియామకాల్లో జరిగిన అక్రమాలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను బాధ్యత వహిస్తూ రాజీనామాచేయాలని కోరారు. నిరాహార దీక్షా శిబిరాలను ధ్వంసం చేయవచ్చని, పోలీసులను, పార్టీ శ్రేణులను ప్రయోగించవచ్చని, నిరసనకారులను అరెస్టు చేయవచ్చని, డీఎస్సీ లీకేజీ, అక్రమాలపై ఆధారాలను చెరిపేయలేరని తెలిపారు. నిరుద్యోగ యువతలో రగులుతున్న ఆగ్రహాన్ని అణచివేయలేరని, ఆంధ్రప్రదేశ్ జెప్ జడ్ గొంతును మూయలేరని న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదని తెలిపారు.
మహిళలు చిన్నారులకు చీకటిరోజు
“దిశ”ను ఉపసంహరించుకోవడం ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, చిన్నారులకు ఒక చీకటి రోజని, మహిళల భద్రతకు అండగా నిలిచిన ఒక సమగ్ర రక్షణ వ్యవస్థను రాజకీయ ఈర్ష్యతో నిర్వీర్యం చేయడం అత్యంత దురదృష్టకరమని మాజీ సిఎం జగన్ తెలిపారు. మహిళలు, చిన్నారులపై నేరాలు, దర్యాప్తులో జాప్యం, న్యాయప్రక్రియలో ఆలస్యం వంటి సమస్యలకు పరిష్కారంగా వైయస్సార్‌సీపీ ప్రభుత్వం “దిశ”ను తీసుకొచ్చిందని పేర్కొన్నారు. నేరం జరగకుండా నిరోధించడం నుంచి, నేరం జరిగితే వెంటనే స్పందించడం, బాధితులకు రక్షణ, వేగంగా దర్యాప్తు, ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, చార్జిషీటు, ప్రత్యేక కోర్టుల ద్వారా సత్వర న్యాయం వరకు ఒక సమగ్ర వ్యవస్థను నిర్మించామని తెలిపారు. దిశలో భాగంగా మహిళలు ప్రమాదంలో ఉన్నప్పుడు ఎస్‌ఓఎస్ బటన్ నొక్కినా, ఫోన్‌ను ఐదుసార్లు షేక్ చేసినా నిమిషాల వ్యవధిలో పోలీసులు స్పందించే వ్యవస్థ తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. “దిశ”ను ఉపసంహరించుకోవడం ద్వారా కూటమి ప్రభుత్వం నేరస్తుల్లో చట్టంపై ఉన్న భయాన్ని తగ్గిస్తోందని పేర్కొన్నారు. బాధిత మహిళల్లో ప్రభుత్వంపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తోందని, మహిళలు తమ రక్షణ కవచంగా భావించిన వ్యవస్థను లేకుండా చేస్తోందని తెలిపారు. మంత్రివర్గం ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని, దిశను రక్షించాలని జగన్ కోరారు.








కామెంట్‌లు (0)