- కర్నూలులో నిరుద్యోగుల ప్రదర్శన
- డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
ప్రజాశక్తి - కర్నూలు కలెక్టరేట్ : పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పది వేల ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేయాలని, అభ్యర్థుల వయోపరిమితిని 34 సంవత్సరాలకు పెంచాలని వందలాది మంది నిరుద్యోగ యువతీ, యువకులు డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా చేశారు. అంతకు ముందు బిర్లాగేట్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర అధ్యక్షతన జరిగిన ఆందోళనలో నిరుద్యోగులు కలెక్టర్ బయటకు వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోవడంతో కొందరు నిరుద్యోగులు కలెక్టరేట్ గేటు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులకు, వారికి మధ్య తోపులాట జరిగింది. అనంతరం అధికారులు స్పందించి వినతిపత్రం స్వీకరించారు. కలెక్టరేట్ ఎదుట ఆందోళనను ఉద్దేశించి డివైఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్లా మాట్లాడుతూ.. టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏడాది జాబ్ కేలండర్ విడుదల చేసి ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చినా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంశాఖ మంత్రి అసెంబ్లీలో రాష్ట్రంలో 26 వేల ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పినా, జాబ్ కేలండర్‌లో కేవలం 2,700 పోస్టులనే చూపించారని విమర్శించారు. మిగిలిన పోస్టులను కూడా కలుపుకొని కనీసం పది వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2022 తర్వాత పోలీసు నియామకాలకు నోటిఫికేషన్ లేకపోవడంతో అనేక మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయారని, దీంతో గరిష్ట వయోపరిమితిని 34 సంవత్సరాలకు పెంచాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరుద్యోగులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు హుస్సేన్ బాషా, సహాయ కార్యదర్శి ప్రకాష్, జిల్లా నాయకులు హరికిషన్, చాణిక్య, లవకుమార్, అంజి తదితరులు, పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)