ప్రజాశక్తి-మంగళం (తిరుపతి) : తిరుమలలోని హథిరాం బావాజీ మఠం భూముల అన్యాక్రాంతం, మఠం ఆర్థిక కార్యకలాపాలు, మహంతుగా వ్యవహరించిన అర్జున్ దాస్ వ్యవహార శైలి, ఇతరత్రా అంశాలపై సుప్రీంకోర్టు నియమించిన అడ్మినిస్ట్రేటివ్ కమిటీ శుక్రవారం తిరుపతి నగర పరిధిలోని గాంధీ రోడ్డు వదనున్న మఠాన్ని సందర్శించి విచారించింది. అడ్మినిస్ట్రేటివ్ కమిటీ చైర్మన్ దుప్పల వెంకటరమణ, సభ్యులు మధ్యప్రదేశ్ ఉజ్జయినికి చెందిన స్వామి మాధవ్ ప్రపన్నచార్య, భోపాల్‌కు చెందిన మాజీ ఐపిఎస్ అధికారి మనీష్ కపూరియా, విజయవాడకు చెందిన సీనియర్ న్యాయవాది వైవి రవిప్రసాద్, ముంబయికి చెందిన ఛార్టెడ్ అకౌంటెంట్ మనీష్ తస్కర్ కమిటీలో ఉన్నారు. వారు మఠం రికార్డు గదులను, పరిపాలన కార్యాలయాలను పరిశీలించి పలు అంశాలపై రికార్డులను తెప్పించుకొని వివరణలు తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ముఖ్యంగా కోట్ల రూపాయల విలువైన తిరుపతి రూరల్, చంద్రగిరి వంటి వివిధ ప్రాంతాలలో ఉన్న మఠం భూముల సర్వే నెంబర్లను, పట్టికలను కమిటీ చైర్మన్, సభ్యులు ప్రత్యేకంగా పరిశీలించి, మరిన్ని రికార్డులను రప్పించుకోవాలని చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రాపర్టీ రిజిస్టర్, వివిధ బ్యాంకుల్లో మఠంకు సంబంధించిన ఖాతాల వివరాలను, బంగారం, వెండి రిజిస్టర్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల రిజిస్టర్లు, నగదు లావాదేవీలకు సంబంధించిన రిజిస్టర్ తేదీల ప్రకారం జరిగిన నగదు వ్యవహారాలు సరిగా లేవని, ఇతర వివరాలపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.








కామెంట్‌లు (0)