- మంత్రి నిమ్మల రామానాయుడు
ప్రజాశక్తి - ఆత్రేయపురం(డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా) : కాలువ శివారు భూములకూ నీరు అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సెంట్రల్ డెల్టా వాటర్ మేనేజ్‌మెంట్ పర్యవేక్షణలో భాగంగా ఆయన బొబ్బర్లంక నుంచి లొల్ల లాకుల వరకు కొత్తపేట ఎంఎల్ఎ బండారు సత్యానందరావుతో కలిసి మోటార్ సైకిల్‌పై శుక్రవారం పర్యటించారు. లొల్ల లాకుల వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, కొత్తపేట జనసేన ఇన్చార్జి బండారు శ్రీనివాస్, ఆకుల రామకృష్ణ, గుబ్బల శ్రీనివాసరావు తదితరులతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ గోదావరి డెల్టా అంటే రాష్ట్రానికి గుండెకాయ లాంటిదన్నారు. 70 ఏళ్ల చరిత్రలో జులైలో 15 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే రావడం ఇదే ప్రథమమన్నారు. నీటి కొరత నేపథ్యంలో ఐదు వేల క్యూసెక్కులు సీలేరు నుంచి తీసుకుని గోదావరి డెల్టాకు పంపిస్తున్నామన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అధికారుల సూచనల మేరకు రైతులు పంటలు పండించాలన్నారు. తక్కువ నీటి యాజమాన్యంతో తక్కువ కాలపరిమితితో కూడిన పంటలను పండించాలని సూచించారు. అవసరమైతే వంతుల వారీ విధానాన్ని అమలు చేస్తామన్నారు. అనంతరం కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడారు. వారి వెంట సెంట్రల్ డెల్టా చైర్మన్ గుబ్బల శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ నరసింహారావు, ఇరిగేషన్ అధికారులు, టిడిపి కూటమి నాయకులు ఉన్నారు.








కామెంట్‌లు (0)