- నరసరావుపేట రుణమేళాలో ముఖ్యమంత్రి చంద్రబాబు
- 1.03 లక్షల మందికి రూ.3,216 కోట్ల రుణాలు పంపిణీ
- చిరు వ్యాపారులకు ష్యూరిటీ లేని రుణాలు : నిర్మలా సీతారామన్
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి: రాష్ర్ట అభివృద్ధిలో బ్యాంకులు భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన 1,03,246 మంది లబ్ధిదారులకు రూ.3,216 కోట్ల రుణాలను నరసరావుపేట కోడెల శివ ప్రసాదరావు స్టేడియంలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇందులో భాగంగా 15 వేల మంది డ్వాక్రా మహిళలకు,13,355 మంది ఎంఎస్‌ఎంఇలకు రుణాలు అందించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు నాయుడు మట్లాడుతూ... రైతులు, విద్యార్థులు, డ్వాక్రా సంఘాల మహిళలు ఇలా అర్హులైన వారందరికీ రుణం అందించటమే లక్ష్యంగా బ్యాంకర్లు ఇదే రీతిలో అన్ని జిల్లాల్లో రుణమేళాలు నిర్వహించాలని కోరారు. ఈ ఏడాది ఆరు జిల్లాల్లో క్రెడిట్ అవుట్ రీచ్ మేళాలు నిర్వహించాలని ఆర్ధిక మంత్రికి విజ్ఞప్తి చేశారు. పది లక్షల డ్వాక్రా సంఘాలు రూ.29 వేల కోట్ల పొదుపుతో దేశానికి ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. రుణాల రీ పేమెంట్ లో 99.5 శాతంతో డ్వాక్రా మహిళలు అగ్రస్థానంలో ఉన్నారని, వీరిలో ఈ ఏడాది ఐదు లక్షల మందిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.
వ్యాపారుల చెంతకే బ్యాంకులు : నిర్మల
చిరు వ్యాపారులకు ష్యూరిటీ లేని రుణాలు అందిస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బ్యాంకుల ద్వారా చిరు వ్యాపారులకు సులభంగా రుణాలు అందేలా పథకాలు తీసుకువచ్చామని తెలిపారు. ప్రస్తుతం బ్యాంకర్లు స్వయంగా వ్యాపారుల చెంతకే వచ్చి రుణాలు ఇస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయులు, రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా,వివిధ బ్యాంకుల మేనేజింగ్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)