శనివారం, 11 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

కుల వివక్ష పై సామాజిక శంఖారావం

1 గంట క్రితం

kvps
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 12, 2026, 01:38 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- సదస్సులో కెవిపిఎస్, సిఐటియు, ఎపి రైతు సంఘం పిలుపు

ప్రజాశక్తి - యంత్రాంగం ; కుల వివక్ష లేని సమాజం కోసం నిర్వహిస్తున్న సామాజిక శంఖారావాన్ని జయప్రదం చేయాలని కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యాద్రి పిలుపునిచ్చారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం, వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాపిత ఆందోళన, ప్రచార పోరాట కార్య్రకమాల్లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా, కడప, అన్నమయ్య, కాకినాడ జిల్లాల్లో సామాజిక శంఖరావం వర్క్‌‌షాపులు నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా సుందరయ్య భవనంలో జరిగిన సదస్సులో అండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ నూతన విద్యా విధానం అమలులో పాఠశాలలు మూసివేయడం, క్రిస్టియన్‌ దళితులకు ఎస్‌‌సి రిజర్వేషన్‌ ‌రద్దు చేయడం వంటి దళిత, బలహీన వర్గాల హక్కులను హరింపచేసేలా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాలు ఉన్నాయని విమర్శించారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె సుబ్బరావమ్మ, ఎపి రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి మర్రాపు సూర్యనారాయణ మాట్లాడుతూ సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా సామాజిక సమస్యల పరిష్కారానికి ఈ మూడు నెలల ప్రచార, పోరాట కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మర్రి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సిపిఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు, కార్యదర్శివర్గ సభ్యులు ఎన్ వై నాయుడు, వి ఇందిర, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి ఈశ్వరరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై మన్మధరావు, ఐద్వా జిల్లా కార్యదర్శి బి లక్ష్మి, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రెడ్డి వేణు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సింహాచలం, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కాకినాడ జిల్లా కేంద్రంలోని కచేరి పేట సుందరయ్య భవన్లో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎవి నాగేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దళితుల స్మశాన వాటిక సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన జిఒ 1235ను తక్షణమే అమలు చేయాలని, జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సులను సంపూర్ణంగా అమలు చేయాలని, ​కోనేరు రంగారావు కమిషన్ సిఫార్సుల ప్రకారం భూమి లేని ప్రతి కుటుంబానికి రెండు ఎకరాల భూమి ఇవ్వాలని, ​కులంతర వివాహాల రక్షణ చట్టం తీసుకురావాలని, మతం పేరుతో వేధింపులు ఆపాలని, ఎస్‌‌సి, ఎస్‌‌టి అత్యాచార కేసుల్లో పోలీసులు నిర్లక్ష్యాన్ని వీడి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కడప ప్రెస్‌‌క్లబ్‌‌లో ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కోశాధికారి కె ఆంజనేయులు మాట్లాడుతూ కులాంతర వివాహల బారిన పడిన యువతను తుద ముట్టిస్తున్న ఘటనలు అనేకం చూస్తున్నామని పేర్కొన్నారు. వ్యకాస జిల్లా కార్యదర్శి అన్వేష్ అధ్యక్షతన నిర్వహించిన కార్య్రకమంలో ఎపి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు శివకుమార్, ఉపాధ్యక్షులు జి.చంద్రశేఖర్, సిఐటియు జిల్లా అధ్యక్షులు లక్ష్మీదేవి, ఐద్వా జిల్లా కార్యదర్శి ముంతాజ్ బేగం పాల్గొన్నారు.

​అన్నమయ్య జిల్లా ఎన్‌‌జిఒ హోమ్‌‌లో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కో-కన్వీనర్ బిసి వెంకటయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వ్యకాస రాష్ట్ర ఉపాధ్యక్షులు దడాల సుబ్బారావు, గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రావు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించినప్పటికీ, నేటికీ దేశంలో కుల వివక్ష, అంటరానితనం, కుల ఆధారిత హింస, సామాజిక బహిష్కరణ, దళితులపై దాడులు, మహిళలపై అత్యాచారాలు, భూముల ఆక్రమణలు, విద్యా-ఉద్యోగ రంగాల్లో వివక్ష కొనసాగుతుండడం అత్యంత ఆందోళనకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు పి శ్రీనివాసులు, సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరిశర్మ, రామానుంలు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మన్యం సుధీర్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్