సామాజిక శంఖారావం సదస్సులో వక్తలు
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్), ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కచేరి పేట సుందరయ్య భవన్లో జిల్లా సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.వి నాగేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. వెంకటేశ్వర్లు సామాజిక శంఖారావం సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా దేశంలో, రాష్ట్రంలో కుల వివక్ష, అంటరానితనం రూపాంతరం చెంది నేటికీ కొనసాగడం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, నారాయణ గురు, పెరియార్ రామస్వామి, గుర్రం జాషువా, పుచ్చలపల్లి సుందరయ్య వంటి మహనీయులు కులవివక్ష లేని సమసమాజ స్థాపన కోసం నిరంతరం పోరాడారని గుర్తు చేశారు. కానీ నేడు పల్లెల్లో దళిత వాడలు ఇప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని, అంటరానితనం వేర్వేరు రూపాల్లో కోరలు చాస్తోందని మండిపడ్డారు.
"రాష్ట్రంలో దళితులు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, వైద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల సమస్యలను పరిశీలించడానికి కెవిపిఎస్, వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాల కార్యకర్తలు అధ్యయన యాత్రలు చేస్తున్నారు. దళితుల స్మశాన వాటికల సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన జీవో 1235ను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. అలాగే జస్టిస్ పున్నయ్య కమిషన్, కోనేరు రంగారావు కమిషన్ సిఫార్సులను తక్షణమే అమలు చేసి, భూమి లేని ప్రతి దళిత కుటుంబానికి రెండు ఎకరాల భూమి ఇవ్వాలి. దళిత మహిళలపై జరుగుతున్న దాడులను, అపహాస్యపు మాటలను అరికట్టాలి." అని వారు డిమాండ్ చేశారు. దళిత అనేది కేవలం ఒక కులానికి సంబంధించినది కాదని, అది ఒక సామాజిక సమస్య అని వారు స్పష్టం చేశారు. సామాజిక న్యాయాన్ని, అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ, వారు ఏ కులమైనా సరే ఈ సామాజిక శంఖారావం ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
సదస్సు ద్వారా ప్రభుత్వం ముందుంచిన ప్రధాన డిమాండ్లు:
దళితుల స్మశాన సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన జీవో 1235ను తక్షణమే అమలు చేయాలి.
జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సులను సంపూర్ణంగా అమలు చేయాలి.
కోనేరు రంగారావు కమిషన్ సిఫార్సుల ప్రకారం భూమి లేని ప్రతి కుటుంబానికి రెండు ఎకరాల భూమి ఇవ్వాలి.
కులంతర వివాహాల రక్షణ చట్టం తీసుకురావాలి. మతం పేరుతో వేధింపులు ఆపాలి.
ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసుల్లో పోలీసుల నిర్లక్ష్యాన్ని వీడి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
దళిత పేటల్లో మూసివేసిన ప్రాథమిక పాఠశాలలను పునరుద్ధరించాలి.
ధరల పెరుగుదలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థుల స్కాలర్‌షిప్స్ పెంచాలి. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీఇంబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలి.
దళిత మహిళలను కించపరుస్తూ మాట్లాడే అహంకార భాషను, దాడులను అరికట్టాలి.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు ఇవ్వాలి.
బ్యాక్‌లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ పునరుద్ధరించాలి.
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలి.
ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రజలందరినీ కలుపుకొని ఐక్య పోరాటాలు నిర్వహిస్తామని, ఈ నెలలో జరగబోయే సామాజిక శంఖారావం బృందాల యాత్రలకు ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున సహకరించి జయప్రదం చేయాలని రాష్ట్ర నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రైతు సంఘం నాయకులు కరణం ప్రసాదరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టేకుమూడి ఈశ్వరరావు, కేఎస్ శ్రీనివాస్, రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నీలపాల సూరిబాబు, గుర్రాల అప్పారెడ్డి, సిఐటియు అఖిలభారత ఉపాధ్యక్షురాలు జి. బేబీ రాణి, జిల్లా అధ్యక్షులు డి. శేష బాబ్జి, చంద్రమళ్ళ పద్మ, పలివెల వీరబాబు, టి. రాజా, అజయ్ కుమార్, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి మోర్తా రాజశేఖర్, ఐద్వా జిల్లా కార్యదర్శి వరలక్ష్మి, రాష్ట్ర నాయకులు సిహెచ్ రమణీ, కెవిపిఎస్ జిల్లా నాయకులు కే. సింహాచలం, విపర్తి శ్రీనివాస్, పెన్షనర్స్ సంఘం జిల్లా కార్యదర్శి యూఎస్ఎన్ రెడ్డి, విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి ఎం. గంగ సూరిబాబు, లోవరాజు, సిద్దు, సంజయ్, దళిత ఉద్యమ సీనియర్ నాయకులు ఏ. రామేశ్వరరావు, శ్రీనివాస్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)