- జులై 21 నుండి అధ్యయన యాత్రలు, ఆందోళనలు
- వ్యవసాయ కార్మిక సంఘం రాష్ర్ట ట్రెజరర్ కె.ఆంజనేయులు
ప్రజాశక్తి - గుంటూరు: దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు, కుల వివక్షత, తదితర సమస్యల పరిష్కారానికి రాబోయే మూడు నెలల కాలంలో సామాజిక శంఖారావం నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ర్ట ట్రెజరర్ కె.ఆంజనేయులు తెలిపారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్తంగా చేపట్టబోతున్న ఈ కార్యక్రమానికి సంబంధించి సన్నాహక వర్క్‌షాప్ శుక్రవారం బ్రాడీపేటలోని పిఎల్‌రావు భవన్‌లో నిర్వహించారు. కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బూరుగ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన వర్క్‌షాప్‌లో ఆంజనేయులు మాట్లాడుతూ నేటి ఆధునిక యుగంలోనూ గ్రామాలలో, పట్టణాల్లో వివిధ రూపాల్లో కుల వివక్షత కొనసాగుతుందని చెప్పారు. కులాంతర వివాహాల సంఖ్య పెరిగినప్పటికీ, కులాంతర వివాహాలు చేసుకున్న వారిపై దాడులు, హత్యలు కూడా పెరుగుతున్నాయని ఆందోళణ వ్యక్తం చేశారు. అలాగే రాష్ర్టంలో ప్రతి ఏటా రెండు వేలకుపైగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు అవుతున్నాయని తెలిపారు. అభివృద్ధి విషయంలోనూ దళితుల పట్ల వివక్షత కొనసాగుతుందని, త్రాగునీరు, రోడ్లు, విద్య, వైద్యం తదితర సౌకర్యాల కల్పనలోనూ వివక్షత ఉందన్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వం చేపట్టిన పాఠశాలల విలీనంలో ఎస్సీ కాలనీల్లోని పాఠశాలలు రద్దు చేశారన్నారు. పాఠశాలల రద్దు ద్వారా విద్యను దూరం చేయటంతోపాటు, పోలింగ్ బూత్‌లను కూడా ఎస్సీ కాలనీల్లో ఉండకుండా చేయటమే పాలకర్గాల లక్ష్యం అన్నారు.
దళితులకు స్మశానాలు లేకపోవటం అతి పెద్ద సమస్యగా మారిందన్నారు. వేలాది గ్రామాల్లో స్మశానాలు లేవన్నారు. కొన్ని చోట్ల ఆక్రమణలకు గురవుతున్నాయని, అలాగే దళితులకే ప్రభుత్వాలు కేటాయించిన సాగు, నివాస భూములు కూడా ఆక్రమణలకు గురవుతున్నాయన్నారు. ఇప్పటికీ దళితులకు దేవాలయ ప్రవేశం లేదన్నారు. అధికార వ్యవస్థలోనూ ఎస్సీల పట్ల చిన్నచూపు ఉందన్నారు. ఆధునిక రూపాల్లో కొనసాగుతున్న కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
సిఐటియు రాష్ర్ట ఉపాధ్యక్షులు కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఎపిలో దళితులపై దాడులు పెరిగాయన్నారు. డిప్యూటీ సిఎం నియోజకవర్గంలో ఎస్సీ కాలనీని సాంఘిక బహిష్కరణ చేస్తే కనీసం స్పందన కూడా లేదన్నారు. టిడిపి, వైసిపి అధికారంలో ఎవరు ఉన్నా దళితులపై దాడులు ఆగట్లేదన్నారు. పట్టణాల్లో ఇప్పటికీ ఎస్సీ, ఎస్టీ వంటి సామాజిక తరగతులకు అద్దె ఇళ్లు దొరకటం గగనమైపోయిందన్నారు. వివక్షతపై దళితులను చైతన్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ర్ట కార్యదర్శి కె.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు లేక నిర్వీర్యం అవుతుందన్నారు. ముఖ్యంగా దళితులలో నిరుద్యోగ సమస్య పెద్ద ఎత్తున ఉందన్నారు. పేరు మోసిన విద్యాసంస్థల్లోనూ వివక్షత కొనసాగుతుందని చెప్పారు. వర్క్‌షాప్‌లో పౌర సంక్షేమ సంఘం రాష్ర్ట నాయకులు సిహెచ్.బాబురావు, ఐద్వా రాష్ర్ట ట్రెజరర్ డి.శ్రీనివాసకుమారి, సిఐటియు జిల్లా కార్యదర్శి వై.నేతాజి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జె.బాలరాజు, ఈమని అప్పారావు, కెవిపిఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వై.కమలాకర్, జె.నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
21 నుండి దశల వారీగా ఆందోళనలు
జులై 21 నుండి28 వరకూ గ్రామాలు, వార్డులలో అధ్యయన యాత్రలు, ఆగస్టు 1,2,3 తేదీలలో సమస్యలపై సచివాయాలలో అర్జీలు ఇవ్వటం, ఆగస్టు 6,7 తేదీలలో మండల ఆఫీసుల వద్ద ధర్నాలు, ఆగస్టు 24న కలెక్టరేట్ వద్ద ధర్నాలు చేయటం జరుగుతుందన్నారు. అప్పటికీ పరిష్కారం కాకపోతే సెప్టెంబర్ లో ప్రత్యక్షకార్యాచరణ ఉంటుందని నాయకులు తెలిపారు.







కామెంట్‌లు (0)