ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ పథకం (ఎఎఎస్) కింద ప్రత్యేక గ్రేడ్ పోస్టు స్కేలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఒకే పోస్టు లేదా కేడర్‌లో 6 ఏళ్లు అర్హత కలిగిన సేవ పూర్తి చేసిన సిబ్బందికి ఈ ప్రయోజనం వర్తించనుంది. ఈ మేరకు ఎస్‌జిఎస్‌డబ్ల్యు శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి అవకాశాలు అందుబాటులో లేక ఒకే పోస్టు లేదా కేడర్‌లో కొనసాగుతున్న ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ పథకం అమల్లో ఉంది. ఈ పథకం కింద ఆరు సంవత్సరాల అర్హత కలిగిన సేవ పూర్తి చేసిన ఉద్యోగికి ప్రస్తుతం ఉన్న పోస్టు వేతన స్కేలు కంటే తదుపరి అధిక వేతన స్కేలు అయిన ప్రత్యేక గ్రేడ్ పోస్టు స్కేలు మంజూరు చేస్తారు. 11వ వేతన సవరణ సంఘం నిబంధనల ప్రకారం, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సిబ్బందిలో 2019, 2020 నియామక సంవత్సరాలకు చెందిన అర్హులైన వారికి ఆరు సంవత్సరాల అర్హత సేవ పూర్తయినప్పుడు ప్రత్యేక గ్రేడ్ పోస్టు స్కేలు మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు సంబంధిత శాఖలు, శాఖాధిపతులు, సమర్థ అధికారులకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.
ప్రత్యేక గ్రేడ్ పోస్ట్ స్కేలుకు ఎపి జెఎసి కృషి
స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగులకు ప్రత్యేక గ్రేడ్ పోస్ట్ స్కేల్ సాధనలో ఎపి జెఎసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు నిరంతర కృషి ఉందని ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ తెలిపింది. ఉద్యోగుల సమస్యను ప్రభుత్వం వద్ద పదేపదే ప్రస్తావిస్తూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్ధిక శాఖ కార్యదర్శి, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు శాఖ కార్యదర్శి తదితర అధికారులతో సంప్రదిస్తూ.. ఎఎఎస్ ప్రయోజనం కల్పించాల్సిన ఆవశ్యకతను వివరించారని సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి.అర్లయ్య, స్టాలిన్ చక్రవర్తి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.






కామెంట్‌లు (0)