వెలిగొండ నీటి విడుదలపై మంత్రి‘నిమ్మల’
రోడ్లు మునుగుతాయనే గ్రామాలు ఖాళీ
డిస్ర్టబ్యూషన్ పనులు పూర్తి కాలేదని వెల్లడి
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో/మార్కాపురం : వెలిగొండ నిర్వాసితులకు కనీస సమయం కూడా ఇవ్వకుండా మెడమీద కత్తి పెట్టి గ్రామాలు ఖాళీ చేయిస్తున్న రాష్ట్రప్రభుత్వం ఆ ప్రాజెక్టుకు వదిలే నీటిని రైతుల పంట పొలాలకు ఇవ్వడం లేదు. అలా ఇవ్వాలనుకున్నా సాధ్యం కాదు. ప్రాజెక్టు నుండి రైతుల పంట పాలాలకు నీటి పారుదల వ్యవస్థ పనులు ఇంకా పూర్తి కాకపోవడమే దీనికి కారణం. మరి ఇంత నిర్థాక్షణ్యంగా, నిర్వాసితులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకువస్తూ గ్రామాలను ఖాళీ చేయించి ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయడం దేనికంటారా...? భూ గర్భ జలాల కోసం... ! ఈ విషయాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా తెలిపారు. దీంతో భూ గర్భ జలాలు ముఖ్యమే కానీ, ఏ మాత్రం ముందస్తు ప్రణాళిక లేకుండా ప్రాజెక్టుకు తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన వారిని ఇంతగా హింసించాలా అన్న విషయం చర్చనీయాం శంగా మారింది. ఈ ప్రాజెక్టుకు 31వ తేది నీటిని విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జరగనున్న ఈ కార్యక్రమాన్ని జిల్లా అధికార యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తోంది. దానిలోభాగంగానే వెలిగొండ నిర్వాసితులు తక్షణమే గ్రామాలు ఖాళీ చేయాలని జిల్లా కలెక్టర్ హుకుం జారీ చేశారు. ఆ మేరకు స్థానికులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపధ్యంలో మార్కాపురం జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడిన మంత్రి ప్రాజెక్టు డిస్ట్రిబ్యూషన్ పనులు పూర్తి కాలేదని, కొంతమేరే పనులు జరిగాయని చెప్పారు. నీటి విడడుదల కూడా పూర్తి స్థాయిలో చేయడం లేదని కేవలం మూడవ వంతుకు మాత్రమే విడుదల చేస్తున్నామని చెప్పారు. ఇలా నీటిని నింపడం వల్ల భూ గర్భజలాలు పెరుగుతాయని అన్నారు. నీరు నింపనప్పుడు గ్రామాలను ఉన్నపళంగా ఎందుకు ఖాళీ చేయిస్తున్నారంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ ‘ గ్రామాలకు వెళ్లే రోడ్లు మునుగుతాయి..అందుకే ఖాళీ చేయిస్తున్నాం’ అని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. నిజానికి ఈ ప్రాంతంలో భూగర్భ జలాల కొరత కొత్తేమి కాదు. రాష్ట్రంలో తీవ్ర కొరత ఉండే ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి! ప్రభుత్వానికి నిజంగా అటువంటి ఆలోచనే ఉంటే.. కనీసం రెండు మూడు నెలల ముందుగా నిర్వాశితులను హెచ్చరించే అవకాశం ఉంది. ఎల్‌నినో హెచ్చరికలు కూడా అప్పటికి జారీ అయిఉన్నాయి. అయినా అప్పట్లో ప్రభుత్వం నుండి అటువంటి సంకేతాలు ఏ మాత్రం లేవు. దీంతో ప్రాజెక్టుకు హడావిడిగా నీటిని నింపాలని నిర్ణయించడం భూ గర్భ జలాల కోసమని చెప్పడం వెనుక ఇతరత్రా అంశాలు ఏమైనా ఉన్నాయా అన్నది చర్చగా మారింది.
కలను సాకారం చేస్తున్నాం
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కరువు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించాలనే మూడు దశాబ్దాల వెలుగొండ కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి చెప్పారు. నిర్వాసితుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రెండేళ్లలో వెలుగొండ ప్రాజెక్టు పనుల కోసం సుమారు రూ.2,250 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసి, రాత్రింబవళ్లు పనులు కొనసాగిస్తూ ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేసిందని తెలిపారు. ప్రాజెక్టు పరిధిలో 11 ముంపు గ్రామాలకు 11 కమిటీలను ఏర్పాటు చేసి, జిల్లా స్థాయి, జలవనరుల శాఖ, సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో నిర్వాసితుల గ్రీవెన్స్‌లను పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సామాజిక, ఆర్థిక సర్వేలో పేరు లేకపోయినా, గెజిట్‌లో నమోదు కాకపోయినా, కొత్త ఇల్లు ఉన్నా.. లేకపోయినా, పేర్లలో తేడాలున్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. రికార్డుల్లో ఉన్న లోపాలను మాత్రమే ప్రాతిపదికగా తీసుకోకుండా, వాస్తవ పరిస్థితులను పరిశీలించి అర్హత ఉన్న ప్రతి నిర్వాసితుడికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రతి నిర్వాసితుడికి పరిహారం అందించే క్రమంలో ప్రభుత్వంపై రూ.169 కోట్ల ఆర్థిక భారం పడుతుందని అన్నారు.








కామెంట్‌లు (0)