తుది పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో రెండో విడత సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీల వారీగా పోలింగ్ కేంద్రాల తుది జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పోలింగ్ కేంద్రాల జాబితా తయారీ, ప్రచురణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆగస్టు 12న షెడ్యూల్‌తో కూడిన సర్క్యులర్‌ను జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారం సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారులు (ఎంపిడిఒ) ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాను ఆగస్టు 23న ప్రచురించారు. ముసాయిదా జాబితాపై వచ్చిన అభ్యంతరాలు, ఫిర్యాదులను ఆగస్టు 26 వరకు స్వీకరించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అందిన అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు ఆమోదంతో ఆగస్టు 31న పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రచురించినట్లు పేర్కొంది. జిల్లాల నుంచి అందిన నివేదికల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 13,278 గ్రామ పంచాయతీల పరిధిలోని 1,33,128 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు 1,36,326 పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. తుది పోలింగ్ కేంద్రాల జాబితా విడుదలతో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో మరో కీలక ఘట్టం పూర్తయింది అయితే, రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ పూర్తవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలను జరపవద్దని వైసిపి హైకోర్టును ఆశ్రయించింది.








కామెంట్‌లు (0)