మంగళవారం, 01 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఒపిఎస్‌‌ను పునరుద్ధరించాలని కదంతొక్కిన ఉద్యోగులు

55 నిమిషాల క్రితం

cps 1.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 12:14 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • విజయవాడలో భారీ ప్రదర్శన

  • హామీలను అమలు చేయాలని నేతల డిమాండ్‌

ప్రజాశక్తి- యంత్రాంగం : కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సిపిఎస్‌)‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఒపిఎస్‌)‌ను పునరుద్ధరించాలని కోరుతూ ఉద్యోగులు మంగళవారం విజయవాడలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఎపిసిపిఎస్‌ఇఎ) ఆధ్వర్యంలో పాత బస్టాండ్‌ ‌నుండి ధర్నా చౌక్‌ వరకు సాగిన ఈ ప్రదర్శనకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో సిపిఎస్‌ ఉద్యోగులు తరలివచ్చి తమ ఐక్యత చాటారు. అనంతరం అక్కడ జరిగిన బహిరంగ సభలో ఎపి ఎన్‌‌జిజిఒ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.విద్యాసాగర్‌, డివి.రమణ, ఎపిసిపిఎస్‌ఇఎ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోరుకొండ సతీష్‌, సిఎం.దాస్‌, పిడిఎఫ్ ఎమ్మెల్సీ గోపి మూర్తి ‌మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోపు సిపిఎస్‌‌ను రద్దు చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా గత ప్రభుత్వం ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. అనంతరం అధికారంలోకి వచ్చిన ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా ఏడాదిలోపే సిపిఎస్‌ ఉద్యోగులతో చర్చించి సిపిఎస్‌ రద్దుకు బలమైన, శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చిందని, రెండు సంవత్సరాలు గడిచినా ఆ హామీ అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో సిపిఎస్‌ విధానంలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు రూ.500, రూ.1,000, రూ.2,000 అత్యంత స్వల్ప మొత్తంలోనే నెలవారీ పెన్షన్ పొందుతున్నారని తెలిపారు. మూడు నాలుగు దశాబ్దాల పాటు ప్రభుత్వానికి సేవలందించిన ఉద్యోగులు వృద్ధాప్యంలో ఇంత తక్కువ పెన్షన్‌ ‌తో జీవనం సాగించాల్సి రావడం అత్యంత బాధాకరమన్నారు. ఈ పరిస్థితుల వల్ల వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని వివరించారు. డిఎ, పిఆర్‌‌సి అమలులో ఆలస్యం వల్ల సిపిఎస్‌ ఉద్యోగులు నష్టపోతున్నారని తెలిపారు. ఉద్యోగ విరమణ అనంతరం లభించాల్సిన పెన్షన్ కార్పస్, నెలవారీ పెన్షన్ రెండూ ఆశించిన స్థాయిలో పెరగడం లేదన్నారు. సిపిఎస్‌ ఉద్యోగి మరణించిన సందర్భంలో కుటుంబ పెన్షన్ మంజూరు సమయంలో నామినీకి చెల్లించాల్సిన పెన్షన్ నిధిలోని 50 శాతం మొత్తాన్ని పూర్తిగా చెల్లించకుండా ప్రభుత్వం మినహాయించుకోవడం అన్యాయమని తెలిపారు. ప్రభుత్వం ఎన్నికల హామీలను గౌరవిస్తూ వెంటనే సిపిఎస్‌‌ను రద్దు చేసి ఒపిఎస్‌‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ఎపిసిపిఎస్‌ఇఎ రాష్ట్ర అధ్యక్షులు కోరుకొండ సతీష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతగుంట్ల మరియదాస్ నాయకత్వం వహించారు. ఎపిజెఎసి చైర్మన్‌ ఆలపాటి విద్యాసాగర్, ఫ్యాప్టో ఛైర్మన్‌ సాయి శ్రీనివాస్, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జానీ బాషా, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రామకృష్ణ, డిపిఆర్టీ అధ్యక్షులు డి శ్రీను, ఎపిటిఎఫ్‌ ‌నాయకులు జోసెఫ్ సుధీర్ బాబు, మంజుల, బసవలింగం తదితరులు పాల్గొన్నారు.

జిల్లాల్లోనూ ఆందోళనలు

గుంటూరులో కలెక్టరేట్‌ ‌నుండి విజ్ఞాన మందిరం వరకూ నిర్వహించిన ర్యాలీలో వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. అనంతరం అక్కడ జరిగిన సభలో ఎపి సిపిఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ‌రాష్ర్ట అధ్యక్షులు బాజీ పఠాన్‌ ‌మాట్లాడుతూ రాష్ర్టంలో 3.5 లక్షల మంది సిపిఎస్‌ ఉద్యోగులు ఉన్నారని, వారంతా అభద్రతా భావంలో ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. సిపిఎస్‌ ‌ర్యాలీకి ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెఆర్‌.సూర్యనారాయణ మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల అన్ని సమస్యలపై రాష్ర్ట ప్రభుత్వం చర్చించి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకునే విధంగా త్వరలో స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సిపిఎస్‌ అంశంపై ఇక రోడ్డెక్కటం మినహా ఉద్యోగులకు గత్యంతరం లేదని తెలిపారు. కార్యక్రమంలో ఎపిజిఇఎ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్, సిసిఎస్‌ అసోసియేషన్‌ అసోసియేట్ అధ్యక్షులు చీర్ల కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఎపి జెఎసి అమరావతి ఆధ్వర్యాన శ్రీకాకుళం జిల్లాలో రెండో రోజూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ‘సిఎం సార్ మా డబ్బులు మాకు ఇవ్వండి’ అనే నినాదంతో కూడిన స్టిక్కర్లను ధరించారు. ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాల వద్ద కొద్దిసేపు ఆందోళన చేపట్టారు. టిటిడి సిపిఎస్‌ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్ అసోసియేషన్, ‌టిటిడి స్టాఫ్ అండ్‌ వర్కర్స్ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో తిరుపతిలో ఉద్యోగులు ‘సిపిఎస్‌ దీక్షా దినం’ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టాఫ్ అండ్‌ వర్కర్స్ యునైటెడ్ ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి కాటా గుణశేఖర్ మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా కల్పించే పాత పెన్షన్ విధానం (ఒపిఎస్)ను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎపి జెఎసి ఆధ్వర్యంలో రెవెన్యూ ఉద్యోగులు విజయనగరం జిల్లా నెల్లిమర్ల తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ప్రభుత్వం నుండి న్యాయంగా రావాల్సిన బకాయిలు, పెండింగ్ డిఎలు వెంటనే చెల్లించాలని, పిఆర్ సి కమిషన్ నియమించాలని, ఐఆర్ వెంటనే ప్రకటించాలని నినాదాలు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో రెవెన్యూ కార్యాలయం వద్ద ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్