ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాలను సాధించేందుకు 10 మందితో రాష్ట్రస్థాయి పర్యవేక్షణ కమిటీని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. కమిటీకి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు ఎన్.రఘువీరారెడ్డి చైర్మన్‌గా, మాజీ కేంద్ర మంత్రి, ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేడీ శీలం కన్వీనర్‌గా నియమించినట్లు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. పర్యవేక్షణ కమిటీ సభ్యులుగా గిడుగు రుద్రరాజు, పల్లం రాజు, కిల్లి కృపారాణి, మస్తాన్ వలి, తులసిరెడ్డి, సిరివెళ్ల ప్రసాద్, గారె ఉషా నాయుడులను నియమించినట్లు వెల్లడించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎపిసిసి సమన్వయం, సామాజిక మాధ్యమాల వ్యవహారాలను పర్యవేక్షించేందుకు పార్టీ అధికార ప్రతినిధి, నెల్లూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌రెడ్డిని బాధ్యతలు అప్పగించింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అధిక స్థానాలను సాధించేందుకు కార్యాచరణ రూపొందించాలని ఎపిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పర్యవేక్షణ కమిటీకి దిశానిర్దేశం చేశారు. ఎన్నికల విధివిధానాలు, అభ్యర్థుల ఎంపిక, పార్టీ శ్రేణుల సమన్వయం తదితర అంశాలపై కమిటీతో జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షులు సమన్వయం చేసుకోవాలని ఆమె ఆదేశించారు.








కామెంట్‌లు (0)