నల్గొండ: కొండమల్లేపల్లి నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్, డైరెక్టర్ కల్లు రూపారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆమెను అదే పాఠశాలలో చదువుతున్న ఇద్దరు మైనర్ విద్యార్థులు 27సార్లు కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి మీడియాకు నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ వివరాలు వెల్లడించారు.నిందితులిద్దరూ నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్‌లో 10వ తరగతి చదువుతూ అక్కడే హాస్టల్‌లో ఉంటున్నారు. వీరి వయస్సు కేవలం 16 సంవత్సరాలు. జల్సాలకు, చెడు వ్యసనాలకు అలవాటు పడిన వీరు.. హాస్టల్‌లో నిబంధనలకు విరుద్ధంగా మొబైల్ ఫోన్లు వాడుతూ ప్రిన్సిపాల్ రూపారెడ్డికి దొరికిపోయారు. అంతేకాకుండా, సోషల్ మీడియా, యూట్యూబ్‌లలో ‘తేలికగా డబ్బు సంపాదించడం ఎలా?’ అని వెతుకుతుండగా గమనించిన ప్రిన్సిపాల్.. వారి తల్లిదండ్రులను పిలిపించి సమక్షంలోనే గట్టిగా మందలించారు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న ఆ విద్యార్థులు ప్రిన్సిపాల్‌పై తీవ్ర కక్ష పెంచుకున్నారు. స్కూల్ ఫీజుల వసూళ్లు జరుగుతుండటంతో ప్రిన్సిపల్ ఇంట్లో డబ్బు ఉంటుందని భావించి చోరికి ప్లాన్ చేసినట్లు తెలిపారు. యూట్యూబ్‌లో సమాచారాన్ని వెతికి, వారం రోజుల పాటు రెక్కీ నిర్వహించారు. హత్య జరగడానికి కొద్దిసేపటి ముందు రూపారెడ్డి తన చిన్నమ్మతో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో హంతకులు ఇంట్లోకి ప్రవేశించగా, రూపారెడ్డి ఫోన్ కట్ చేయకుండానే ‘బాబు’ అని పిలిచారు. ఆ తర్వాత ఫోన్ కట్ అయిపోయింది. రూపారెడ్డి చిన్నమ్మ ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. సాధారణంగా పాఠశాల విద్యార్థులను ‘బాబు’అని పిలవడం రూపారెడ్డికి అలవాటు. దీంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించగా, అసలు నిందితులు సొంత స్కూల్ విద్యార్థులేనని తేలింది. హత్య అనంతరం రూ.1.54 లక్షల నగదు, రూపారెడ్డి ఫోన్ తీసుకుని పారిపోయారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని, రక్తపు మరకలున్న నగదు, ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు మైనర్లు అయినందున వారిని జువైనల్ జస్టిస్ బోర్డుకు పంపిస్తామని ఎస్పీ వివరించారు.
ప్రిన్సిపల్ రూపారెడ్డిని చంపింది విద్యార్థులే.. : నల్గొండ ఎస్పీ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 19, 2026, 06:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)