కాకినాడ పోర్టును జాతీయ రహదారి 216 తో అనుసంధానం
ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ పోర్టు దక్షిణ ద్వారం నుంచి ఉప్పలంక వద్ద ఉన్న జాతీయ రహదారి వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర ఈ కొత్త రహదారిని నిర్మించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడ పోర్టు దక్షిణ ప్రాంతం నుండి జాతీయ రహదారి సంఖ్య 216 వరకు నాలుగు వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారిని నిర్మించేందుకు బుధవారం కాకినాడ కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ అధ్యక్షతన భాగస్వామ్య శాఖ అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ రహదారుల సంస్థ అధికారి బి. కృష్ణమూర్తి కాకినాడ పోర్టు దక్షిణ ప్రాంతం నుండి జాతీయ రహదారి 216 వరకు నాలుగు వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారిని నిర్మించే ప్రాజెక్టు కు సంబంధించి గత జూలై నెల లో గౌరవ ప్రజాప్రతినిధుల తో నిర్వహించిన మొదటి సమావేశంలో సూచించిన సూచనలు,ఇందుకు అను గుణంగా క్షేత్రస్థాయిలో పరిశీలించిన వివరాల సమగ్ర నివేదికపై ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ కాకినాడ పోర్టు దక్షిణ ద్వారం నుంచి ఉప్పలంక వద్ద ఉన్న జాతీయ రహదారి వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర ఈ కొత్త రహదారిని నిర్మించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం పోర్టు నుండి వచ్చే సరుకు రవాణా వాహనాలు కాకినాడ నగరం గుండా సుమారు 27 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందని, దీనివల్ల సమయం, రవాణా ఖర్చులు పెరుగుతున్నాయని తెలిపారు. కొత్తగా నిర్మించనున్న ఈ ఐదు కిలోమీటర్ల రహదారి వల్ల రవాణా దూరం 22 కిలోమీటర్లు తగ్గడమే కాకుండా, ప్రయాణ సమయం 30 నుండి 40 నిమిషాల వరకు ఆదా అవుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా నగరంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు, రహదారి భద్రత మెరుగుపడటం, ఇంధన ఆదా, పర్యావరణ కాలుష్యం తగ్గడం, స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ రహదారి మార్గనిర్ణయం, భూసేకరణ వంటి అంశాల లో పర్యావరణ, చట్టపరమైన నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. ఈ సమావేశంలో కాకినాడ పోర్టు, రైల్వే, అటవీ, మత్స్యశాఖ అధికారులు సూచించిన సూచనలను ఎన్.హెచ్.ఏఐ అధికారులు సిద్ధం చేసిన అలైన్మెంట్ తో మరోక దఫా సరిచూసు కోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. నాలుగు వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారి ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు అవసరమైన సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డా.టి.తిప్పే నాయక్ ఇతర భాగస్వామ్య శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)