ప్రజాశక్తి - పాడేరు (అల్లూరి జిల్లా): అల్లూరి జిల్లా డిఎంఅండ్‌హెచ్‌ఒ కృష్ణమూర్తి నాయక్‌ను అవినీతి, అక్రమాలు, వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణమూర్తి నాయక్ వ్యవహార శైలిపై ఇటీవల జరిగిన ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సిపిఎం అనంతగిరి జడ్‌పిటిసి సభ్యులు డి.గంగరాజుతో పాటు పలువురు ఏజెన్సీ ప్రాంత ప్రజాప్రతినిధులు గళమెత్తారు.
ఆయన పనితీరు బాగోలేదని, తొలగించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. అధికార దుర్వినియోగం, క్షేత్రస్థాయి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిపై వేధింపులు, అక్రమ వసూళ్లు, నిబంధనలకు విరుద్ధంగా డిప్యుటేషన్లు ఇచ్చినట్లు వచ్చిన తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఆయనపై సస్పెన్షన్ చర్యలు చేపడుతూ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి జి.వీరపాండ్యన్ సస్పెన్షన్ ఉత్తర్వులు (జిఒ ఆర్‌టి నెంబర్ 669) జారీ చేశారు.
విశాఖపట్నం ఆర్‌డిఎంహెచ్‌ఒ అందించిన నివేదిక ఆధారంగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఇచ్చిన సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. క్రమశిక్షణా చర్యలు పూర్తయ్యే వరకు ఈ సస్పెన్షన్ అమల్లో ఉంటుందని పేర్కొంది. సస్పెన్షన్ కాలంలో ముందస్తు అనుమతి లేకుండా పాడేరు హెడ్‌క్వార్టర్స్ వదిలి వెళ్లకూడదని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం జీవనభృతి చెల్లిస్తామని వెల్లడించింది.








కామెంట్‌లు (0)