ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో పచ్చదనాన్ని భారీగా పెంచి, పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రకృతి ఆధారిత జీవనోపాధి అవకాశాలను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్‌రిచ్‌మెంట్ (ఏపీ–గ్రీన్)ను ఏర్పాటు చేసినట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు. 2047 నాటికి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అడవులు, పచ్చదనాన్ని 50 శాతానికి పెంచడం సంస్థ ప్రధాన లక్ష్యమని గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర భూభాగంలో 37.42 లక్షల హెక్టార్లలో నోటిఫైడ్ అటవీ ప్రాంతం ఉండగా.. ఇది రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 22.96 శాతంగా ఉందని, 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంలో భాగంగా 2030 నాటికి 33 శాతం పచ్చదనాన్ని సాధించేందుకు కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. అటవీ, వ్యవసాయ, ఉద్యానవన, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్య, పరిశ్రమలు, జలవనరులు, పట్టణ స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, సీఎస్‌ఆర్ సంస్థలు, ప్రజలను భాగస్వాములను చేస్తూ పచ్చదనం పెంపు కార్యక్రమాలను సమన్వయం చేయనున్నట్లు తెలిపారు.








కామెంట్‌లు (0)