గురువారం, 22 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సుప్రీం కోర్టు ఉత్తర్వులు లెక్కచేయకుండా ప్రత్యర్థులపై టిడిపి దాడులు

56 నిమిషాల క్రితం

cpmlogo
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026, 08:18 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • సిపిఎం ఖండన

ప్రజాశక్తి-విజయవాడ : సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులను కూడా లెక్క చేయకుండా అధికార దురహంకారంతో ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల నామినేషన్ సందర్భంగా టిడిపి దాడులు చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండించింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనను విడుదల చేశారు. . ప్రత్యర్థులు ఎన్నికల నామినేషన్లు వేయకుండా దాడులు చేస్తున్న అధికార టిడిపి నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా పార్టీ కార్యదర్శి వి.గంగరాజును కిడ్నాప్‌ చేసిన పూతలపట్టు శాసనసభ్యుడు మురళిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వివిధ జిల్లాలలో ఎంపిటిసి, జెడ్‌పిటిసిలకు నామినేషన్లు వేస్తున్న సిపిఎం కార్యకర్తలపై పలుచోట్ల తెలుగుదేశం దాడులుచేసి నామినేషన్ వేయకుండా ఆటంకాలు సృష్టించి.. కొన్నిచోట్ల భౌతిక దాడులు కూడా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టిడిపి దాడిలో గాయపడ్డ సిపిఎం నాయకులు టి.ఆవులయ్యటిడిపి గుండాల దాడిలో గాయపడ్డ పి.ఆవులయ్య

మార్కాపురం జిల్లా కొమరోలు ఎంపిటిసికి నామినేషన్ వేస్తున్న ఎం.అంజమ్మకు మద్దతుగా వెళ్లిన సిఐటియు జిల్లా అధ్యక్షుడు పి.ఆవులయ్యపై టిడిపి గుండాలు రాళ్లతో దాడిచేయడంతో తలకు తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నారని తెలిపారు. టిడిపి వారు ఎన్నికల అధికారి కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో చేరి అభ్యర్దులను భయభ్రాంతులను చేస్తున్నారని.. అంతేగాక భౌతిక దాడికి కూడా పూనుకొని హత్యాయత్నం చేయడం దారుణమైన విషయమన్నారు. అయినా ఇంతవరకు పోలీసులు స్పందించలేదని ఆవులయ్యపై దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదుచేసి తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

మార్కాపురం జిల్లా సి.ఎస్.పురం మండలంలో సిపిఎంతో సహా ఇతర అభ్యర్థులను కూడా నామినేషన్లు వేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని.. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన తర్వాతే ఆఖరి నిమిషంలో వారి నామినేషన్లను అక్కడ ఆర్‌ఓ స్వీకరించారని తెలిపారు.

చిత్తూరు జిల్లా ఎం.బండ్లపల్లిలో ఎంపిటిసిగా పోటీ చేస్తున్న ఎం.కాంతమ్మను నామినేషన్ వేయనీయకుండా పెద్ద ఎత్తున టిడిపి కార్యకర్తలు అడ్డుపడ్డారన్నారు. జిల్లా కార్యదర్శి గంగరాజు కలెక్టరు, ఇతర అధికారులతో మాట్లాడుతున్న సందర్భంలో పూతలపట్టు తెలుగుదేశం ఎమ్మెల్యే తన అనుచరులతో వచ్చి గంగరాజుని బలవంతంగా లాగి తమ కారులో తీసుకుని వెళ్లారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల మాదిరిగానే అభ్యర్థులను చంపుతామని బెదిరించడం, నామినేషన్ దాఖలు చేయడానికి కూడ రానివ్వకుండా ఒత్తిడి చేయడం, ధైర్యంగా వచ్చినవారిపై దాడులు చేయడం జరుగుతుందన్నారు. టిడిపి నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని విచ్చలవిడి దాడులు చేస్తూ చేయడం గర్హనీయమన్నారు.

బ్రహ్మంగారి మఠం కడప జిల్లా జెడ్‌పిటిసికి నామినేషన్ వేసేందుకు వెళ్ళిన సిపిఎం అభ్యర్థి నుండి తెలుగుదేశం శ్రేణులు నామినేషన్ పత్రాలు లాక్కొని చించి వేయడం దారుణమన్నారు. పట్టణ ప్రాంతాల్లో నామినేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కూడా ద్రృష్టిలో ఉంచుకుని మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు అన్నిచర్యలూ చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్