బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionతేలని ‘పంచాయితీ’

-596 నిమిషాల క్రితం

images.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026, 12:42 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • పోటీపై కూటమి నేతల వరుస భేటీలు

  • చంద్రబాబుతో విడివిడిగా సమావేశమైన జనసేన, బిజెపి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : స్థానిక సమరానికి రంగం సిద్ధమైన వేళ... కూటమిలో సీట్ల పంచాయితీ అగ్గి రాజేస్తోంది. ఎవరికి వారు పట్టుదలగా ఉండటంతో ఇంకా తేలని స్థానిక పోటీపై మిత్రపక్షాలైన జనసేన, బిజెపి నేతలతో సిఎం చంద్రబాబు బుధవారం కూడా విడివిడిగా వరుస భేటీలు నిర్వహించారు. ఎవరు ఏ స్థానాల్లో పోటీ చేయాలి, ఏ పార్టీకి ఎంత శాతం సీట్లు కేటాయించాలనే లెక్కలు తేలలేదు. సిఎం చంద్రబాబుతో సమావేశమైన వారిలో జనసేన సీనియర్‌ ‌నాయకులు, మంత్రి నాదెండ్ల మనోహర్‌, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు, జనసేన రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్‌ ఉన్నారు. చర్చించిన అంశాలను నాదెండ్ల మనోహర్‌.. జనసేన అధినేత, డిప్యూటీ సిఎం పవన్‌‌కల్యాణ్‌ వద్దకు వెళ్లి వివరించారు. మరలా ఆయన అభిప్రాయాలను చంద్రబాబుకు చెప్పారు. ఉదయం నుంచి సాగిన చర్చలు సాయంత్రానికి కొలిక్కి రానట్లు సమాచారం. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరి మనోభావాలూ దెబ్బతినకుండా కూటమి తరపున కలిసే పోటీ చేయాలని నిర్ణయించినట్లు సమావేశం అనంతరం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ ‌విలేకరులతో చెప్పారు. ఎవరికి ఎక్కడ బలం ఉంటే అక్కడ పోటీ చేసి గెలవాలని నిర్ణయించినట్లు తెలిపారు. కూటమి తరపున ఒక్క అభ్యర్థే పోటీలో ఉంటారని చెప్పారు. ఎవరు ఎక్కడ పోటీ చేస్తారనే జాబితా రెండు రోజుల్లో అధికారికంగా కూటమి తరపున ప్రకటిస్తామని వెల్లడించారు. ‌‌జనసేన కార్యకర్తలకు పవన్‌కల్యాణ్‌ ఆశించిన న్యాయం ఈ ఎన్నికల్లో ఉంటుందని జనసేన నేత చిల్లపల్లి శ్రీనివాసరావు తెలిపారు.

40.01 శాతం కోరిన జనసేన

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన 40.01 సీట్లలో పోటీ చేస్తుందనే ప్రచారం నడిచింది. జనసేన సీనియర్‌ నేత, పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్‌ ‌తన అధికారిక ‘ఎక్స్‌’లో ఇదే అంశాన్ని పొందుపరిచారు. కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో కూటమి పొత్తులో భాగంగా 40.01 వాటాతో 2,091 పదవులను కేటాయించాలని పార్టీ ప్రతిపాదించిందని ఆయన పేర్కొన్నారు. 17 స్థానాలు ఉన్న మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవుల్లో 35 శాతం, స్టాండింగ్‌ ‌కమిటీ ఛైర్‌‌పర్సన్‌ 30 శాతం, సభ్యులు 40 శాతం, మున్సిపాల్టీ ఛైర్మన్లు 42 శాతం, వైస్‌ ‌ఛైర్మన్లు 45 శాతం, నగర పంచాయతీ ఛైర్మన్లు 35 శాతం, వైస్‌ ‌ఛైర్మన్లు 35 శాతం, వార్డు కౌన్సిలర్లు/కార్పొరేటర్లు 40 శాతం చొప్పున ప్రతిపాదించినట్లు తెలిపారు. మొత్తం 5,220 పదవుల్లో 2,091 స్థానాలు కోరినట్లు పేర్కొన్నారు.

​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్