సిఇసి రాజీనామా చేయాల్సిందే
ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ భారీ ప్రదర్శన
ప్రజాశక్తి - న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర ప్రభుత్వ ఆంక్షలను అధిగమించి ఢిల్లీలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీశారంటూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన నిర్వహించారు. జంతర్‌మంతర్‌ను తిరిగి నిరసనకారులకు అందుబాటులోకి తీసుకురావాలని నినదిస్తూ సాగిన ప్రదర్శనను ఢిల్లీ పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు అడ్డుకున్నాయి. అనంతరం ఆందోళనకారులపై దాడికి దిగాయి. బుధవారం నాడిక్కడ ఫిరోజ్‌షా రోడ్డు నుంచి ప్రదర్శన ప్రారంభమైంది. డివైఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఎఎ రహీం, ఎంపి వి. శివదాసన్, ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షులు ఆదర్శ్ ఎం సాజి, డివైఎఫ్ఐ కేంద్ర కార్యవర్గ సభ్యులు జాక్ సి థామస్ తదితరులు ప్రదర్శనకు నాయకత్వం వహించారు. ప్రదర్శన జంతర్‌మంతర్ సమీపానికి చేరుకోగానే పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నాయి. అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆందోళనకారులను హెచ్చరించాయి. అయినప్పటికీ నిరసన కొనసాగించేందుకు కార్యకర్తలు సిద్ధపడటంతో పోలీసులు దాడికి దిగారు. విద్యార్థులు, యువకులను విచక్షణారహితంగా కొట్టి అదుపులోకి తీసుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళా కార్యకర్తలపైనా దాడి చేశారు. ఎస్ఎఫ్ఐ ఢిల్లీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఉర్సులపై పోలీసులు తీవ్రంగా దాడి చేశారు. ఈ క్రమంలో భగత్‌సింగ్ చిత్రపటాన్ని పోలీసులు కాళ్లతో తొక్కి ధ్వంసం చేశారు. ఆందోళనకారులను రెండు బస్సుల్లో ఎక్కించి అదుపులోకి తీసుకెళ్లారు. అయితే, ఒక బస్సులో ఉన్న కార్యకర్తలంతా మార్గమధ్యంలో తప్పించుకున్నారు. ఈ ప్రదర్శనలో డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు పిఎం ఆర్షో, ఎంవి నికేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)